DSC 98 Postings : విద్యా సంవత్సరం పూర్తి కావొచ్చే…. ఉద్యోగాలేవి జగనన్న….?
DSC 98 Postings ఒకటి కాదు రెండు కాదు 24ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికారన్న సంతోషం నిరుద్యోగులకు దక్కకుండా పోయింది. డిఎస్సీ 98లో అర్హత సాధించినా ఉద్యోగాలు దక్కని వారికి ఊరటనిచ్చే ప్రకటన చేసి ఏడాది గడిచిపోతున్నా పోస్టింగులు మాత్రం దక్కలేదు. ముఖ్యమంత్రి ప్రకటనలు మాటలకే తప్ప ఆచరణకు నోచుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
DSC 98 Postings పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ 98లో ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి మినిమం టైమ్ స్కేల్‌తో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి ఏడాది దగ్గర పడుతున్నా వారికి ఉద్యోగాలు మాత్రం దక్కలేదు. ఎన్నికలకు మరో ఏడాది ఉండటంతో డిఎస్సీ 98 అభ్యర్థులకు ఇప్పట్లో ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో అధికారులు లేనట్టు కనిపిస్తోంది. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే డిఎస్సీ 98 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ 98లో అర్హత సాధించిన అభ్యర్థులంతా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటే వారికి టైమ్ స్కేల్ వర్తింప చేసి ఉద్యోగాలనిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు.
గత ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో దాదాపు 6500మంది అభ్యర్థులు జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.వీరిలో చాలామంది ప్రైవేట్ స్కూళ్లలో ఉద్యోగాలు చేసుకుంటుండగా మరికొందరు ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ 98లో అర్హత పొందిన వారందరికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతో అభ్యర్థులు సంబర పడ్డారు. ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు, ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారు చేస్తున్న పనులు మానేసి ప్రభుత్వం ఇచ్చే మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కనీస వేతనంగా ఉపాధ్యాయులకు నెలకు రూ.30వేల రుపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది చేస్తున్న ఉద్యోగాలు మానేశారు.
ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకున్న వారిలో చాలామంది వయసు 50ఏళ్లకు చేరువలో ఉండటం, కొంత మంది ఉపాధ్యాయేతర వృత్తుల్లో ఉండటం, విద్యా బోధనకు దూరంగా ఉన్న వారిని ఎలాంటి విధుల్లో సర్దుబాటు చేయాలనే మీమాంశ ప్రభుత్వాన్ని వేధించింది. మరోవైపు గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం లోపు చేయాల్సిన ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారాన్ని కూడా నెలల తరబడి సాగదీస్తూ ఉండటంతో డిఎస్సీ98 ఉద్యోగార్ధులపై ప్రభావం పడింది. ఉపాధ్యాయుల బదిలీ, సర్దుబాటు తేలకుండా ఖాళీలను ఖరారు చేసే పరిస్థితి లేకపోవడంతో జాప్యం జరిగింది.
ఆ ఆలశ్యం రోజులు, వారాలు దాటిపోయి నెలలు గడిపోయాయి. దీంతో ఉన్న ఉద్యోగాలను వదిలేసిన వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. నెలల తరబడి ఉపాధి లేక, భార్యా పిల్లల్ని పోషించలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కూడా గందరగోళంగా సాగుతోంది. గత రెండు నెలలుగా ఈ ప్రక్రియను కొలిక్కి తీసుకురాకపోవడం, విద్యా సంవత్సరంలో తుది పరీక్షలు సమీపిస్తుండటంతో ఇప్పట్లో బదిలీలు జరుగుతాయో లేదో అనే సందేహం ఉంది.
మరోవైపు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కొలిక్కి వచ్చినా పరీక్షలు పూర్తై, ఫలితాలను వెల్లడించిన తర్వాతే బదిలీ అయిన చోట విధుల్లో చేరేలా ఉత్తర్వులిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే డిఎస్సీ 98లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు వచ్చే విద్యాసంవత్సరం వరకు ఎదురు చూపులు తప్పకపోవచ్చు. 24ఏళ్ల నిరీక్షను కాస్త 25ఏళ్లు పూర్తైతే కాని అపాయింట్‌మెంట్‌లకు నోచుకోవేమోననే సందేహాలు లేకపోలేదు.
టాపిక్