Trains Accident Deaths: రైలు ప్రమాదంలో మృతులు వీరే..
30 October 2023, 11:06 IST
- Trains Accident Deaths: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. వీరిలో 11మంది మృతులను గుర్తించారు. మరో 50మంది క్షతగాత్రులు విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
విజయనగరంలో ప్రమాదానికి గురైన ప్యాసింజర్ రైళ్లు
Trains Accident Deaths: రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను రైల్వే శాఖ ప్రకటించింది. 13మంది మృతుల్లో 11మంది వివరాలను గుర్తించారు.
మృతుల్లో విజయనగరం జిల్లా జామి మండలం గొడి కొమ్ము గ్రామానికి చెందిన కంచుబరాకి రవి, శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం ఎస్పీరామచంద్రపురం గ్రామానికి చెందిన గిడిజల లక్ష్మీ, విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుసంభం గ్రామానికి చెందిన కరణం అప్పలనాయుడు, విజయనగరంకు చెందిన చల్లా సతీష్, విశాఖపట్నం ఎన్‌ఏడి ప్రాంతానికి చెందిన రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్ ఎస్ఎంఎస్ రావు ఉన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన రైల్వే గ్యాంగ్‌మెన్ చింతల కృష్ణం నాయుడు రాయగడ ప్యాసింజర్‌లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయాడు.
విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుసంభంకు చెందిన పిళ్లా నాగరాజు, పలాస ప్యాసింజర్‌లో గార్డుగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం మెట్టవలసకు చెందిన టెంకల సుగుణమ్మ, విజయనగరం జిల్లా చీపురుపల్లి రెడ్డిపేటకు చెందిన రెడ్డి సీతంరాజు, గరివిడి మండలం, గడబవలస గ్రామానికి చెందిన మజ్జిరాములు ఉన్నారు. మరో ఇద్దరు ప్రయాణికులను గుర్తించాల్సిఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు జిల్లా సర్వజన ఆసుపత్రిలో క్షగాత్రులకు వైద్య సహాయ చర్యలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పర్యవేకషించారు. మృతి చెందిన 13 మందిలో ఇప్పటివరకు 11 మృత దేహాలు గుర్తించినట్టు కలెక్టర్ తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామన్నారు. క్షత గాత్రులకు రూ.2 లక్షలు వరకు పరిహారం చెల్లిస్తామన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో 38 మందికి చికిత్స పొందుతున్నారు.
విశాఖ కేజీహెచ్, ఎన్.ఆర్.ఐ., మెడికవర్ ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడిన ఒక్కొక్కరు చొప్పన వైద్య చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. వైద్య సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మృత దేహాలను పోస్టు మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగిస్తామన్నారు.