తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Krishna Cable Bridge : ఏపీ-తెలంగాణ మధ్య కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి

Krishna Cable Bridge : ఏపీ-తెలంగాణ మధ్య కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి

HT Telugu Desk HT Telugu

14 October 2022, 9:39 IST

google News
    • Krishna Cable Bridge ఆంధ్రా, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో వివరాలు ప్రకటించారు.   దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్‌ బ్రిడ్జిని  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.  దాదాపు వెయ్యి కోట్ల రుపాయల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 
కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి
కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి

కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి

Krishna Cable Bridge దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్‌ కేబుల్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ నడుమ నిర్మించబోతున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీనిని పూర్తిచేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విటర్‌లో ప్రకటించారు.

‘‘ప్రగతి కా హైవే’’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో నితిన్ గడ్కరీ ఈ ట్వీట్‌ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా-కర్నూలు జిల్లాలోని సోమశిల వద్ద ఈ బ్రిడ్జి నిర్మితం కానుంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో ఈ తరహా కేబుల్ బ్రిడ్జి రెండోది అవుతుంది.

దేశంలో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జిలలో మొదటిది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మితం కానుంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తైతే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని, వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని వివరించారు.

కృష్ణానదిపై నిర్మించే వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్‌ వాక్‌వే ఉంటుందన్నారు. గ్లాస్‌ వాక్‌వేతో నిర్మితం కానుండటంతో పర్యాటకంగా ఈ మార్గం టూరిస్ట్‌ డెస్టినేషన్‌ అవుతంది. తెలంగాణలోని కొల్లాపూర్‌ నుంచి ఏపీకి నేరుగా వెళ్లాలంటే పడవలో ప్రయాణించాల్సిందే. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వెళ్లేవారు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు.

తదుపరి వ్యాసం