APCM Chandrababu Oath: చంద్రబాబు నాయుడు అనే నేను.. దైవ సాక్షిగా చంద్రబాబు ప్రమాణం
21 June 2024, 10:10 IST
- APCM Chandrababu Oath: ఏపీ అసెంబ్లీ 16వ సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు.
చంద్రబాబు నాయుడు అనే నేను...
APCM Chandrababu Oath: ఏపీ అసెంబ్లీలో సిఎం నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. 16వ శాసన సభ సమావేశాలను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే సభా నియమాలను ప్రకటించారు. అనంతరం కొత్త సభ్యుల ప్రమాణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట సభలో ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు అనే నును శాసనసభ్యునిగా ఎన్నికైనందున, శాసనం ద్వారా నిర్మితమైన భారతరాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడతానని, తాను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.అనంతరం సభ నియమాకాలకు కట్టుబడి, వాటిని అనుసరిస్తూ, సభా మర్యాదలు కాపాడతానని, సంప్రదాయాలు కాపాడతానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
ఏపీ అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం శాసనసభా పక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడితో కలిసి ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లే ఆనవాయితీ ఉంది. సభ్యుల ప్రమాణ స్వీకారానికి జగన్ గైర్హాజరు కావడంతో చంద్రబాబు ఒక్కరే స్పీకర్‌ను అభినందించారు.
చంద్రబాబు తర్వాత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. కొత్తగా ప్రమాణం చేసిన సభ్యులు ప్రొటెం స్పీకర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అక్షర క్రమంలో సిఎం, డిప్యూటీ సిఎంల తర్వాత అనిత, అచ్చన్నాయుడు, టీజీ భరత్, ఫరూక్, లోకేష్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నాారాయణలు ప్రమాణం చేశారు. ఒక్కో సభ్యుడు శాసనసభ్యుడిగా ఒక సారి, సభా నియమాలకు సంబంధించి మరోసారి ప్రమాణం చేశారు.