Ysrcp Corporator Husband: చంద్రబాబు ర్యాలీలో చోరీ చేస్తూ దొరికిన వైసీపీ కార్పొరేటర్ భర్త
01 November 2023, 12:25 IST
- Ysrcp Corporator Husband: చంద్రబాబు ర్యాలీలో జేబు దొంగలు రెచ్చిపోయారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్దకు తరలి వచ్చిన సమూహంలో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. టీడీపీ కార్యకర్తల జేబులో ఫోన్ ,డబ్బులు కొట్టేస్తూ విజయవాడ వైసీపీ కార్పొరేటర్ భర్త గోదావరి బాబు దొరికిపోయాడు.
జేబు దొంగతనం చేస్తూ దొరికిన వైసీపీ కార్పొరేటర్ భర్త
Ysrcp Corporator Husband: రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ చేరడానికి 14గంటల సమయం పట్టింది. దారిపొడవున చంద్రబాబుకు సంఘీ భావం తెలిపేందుకు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో జేబు దొంగలు పండుగ చేసుకున్నారు.
రాజమహేంద్ర వరం నుంచి చంద్రబాబుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తెల్లవార్లు వేల సంఖ్యలో జనం రోడ్లపై ఎదురు చూడటంతో సందట్లో సడేమియా అన్నట్లుగా జేబు దొంగల హల్ చల్ చేశారు.
చంద్రబాబు ర్యాలీలో చోరీలు చేస్తూ వైసీపీ కార్పొరేటర్ భర్త దొరికిపోయాడు. తెల్లవారుజామున నాలుగున్న సమయంలో విజయవాడ బెంజ్ సర్కిల్ లో టీడీపీ కార్యకర్తల జేబుల్లో రూ.20 వేలు కొట్టేసినట్లు గోదావరి బాబు పారిపోయేందుకు ప్రయత్నించాడు.
జేబులో డబ్బులు పోయినట్టు గుర్తించిన టీడీపీ శ్రేణులు నిందితుడు గోదావరి బాబుకు దేహశుద్ధి చేవారు. గోదావరి బాబు భార్య విజయవాడ పశ‌్చిమ నియోజక వర్గం పరిధిలోని కొత్తపేట47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గోదావరి గంగగా గుర్తించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్లో గోదావరి బాబుపై కేడీ షీట్ ఉంది. జేబు దొంగతనాలు, రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల చోరీలో ఆరితేరన గోదావరి బాబు భార్యకు గత ఎన్నికల్లో వైసీపీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచింది.
భార్య ప్రజాప్రతినిధి అయిన తర్వాత కూడా గోదావరి బాబు పాత వృత్తిని వదులుకోకపోవడం చర్చగా మారింది. టీడీపీ కార్యకర్తల జేబులో డబ్బులు చోరీ చేసి వాటిని వెంటనే మరొకరికి ఇచ్చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు. అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించిన గోదావరి బాబును టీడీపీ కార్యకర్తలు వెంటాడి పట్టుకుని దేహశుద్ధి చేశారు. గొడవ జరుగుతుండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధిగా ముఖ్య అనుచరులుగా ఉన్న వారిలో చాలామంది నేరచరితులు, కాల్ మనీ వ్యాపారులు, చిల్లర దొంగలు ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది.