Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరం... తల్లికి తెలియకుండానే మైనర్‌కు పెళ్లి, కర్ణాటకలో ఉద్యోగమంటూ మోసంతో పెళ్లి
16 December 2024, 9:10 IST
- Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లికి తెలియకుండానే మైనర్‌ను ఒక యువకుడు పెళ్లాడాడు. తాను కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నానంటూ బాలిక మేనమామకు నిందితుడు మాయమాటలు చెప్పాడు. దీంతో కర్ణాటక తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
కర్నూలులో బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
Kurnool Crime: బాలికను మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటనపై కర్నూలులో పోక్సో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా ఆదోని మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోణ గ్రామంలో మేనమామ వద్ద బాలిక ఉంటుంది. బాలికకు తండ్రి లేడు. తల్లి కాంత్రినగర్‌లో నివాసం ఉంటుంది. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన సుధాకర్ భార్య మృతి చెందింది. దీంతో ఇటీవలి 14 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక తల్లికి తెలయకుండా ఈ వివాహం జరిగింది.
మేనమామ సంరక్షణలో బాలిక ఉండటంతో సుధాకర్, బాలిక మేనమామకు మాయ మాటలు చెప్పాడు. తాను కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నానని, మీ మేనకోడలిని ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. ఆ మాయమాటల నమ్మిన మేనమామ తన మేనకోడలికి పెళ్లి కావడం ముఖ్యమని భావించాడు. ఆమెకు పెళ్లి చేసి తన బాధ్యతను పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో మేనకోడలి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు.
తల్లికి తెలియకుండా వివాహం జరిపించేందుకు బాలిక మేనమామ సిద్ధమయ్యాడు. బాలికకు సుధాకర్ కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నాడని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిన మేనమామ, కర్ణాటక రాష్ట్రంలోని సిరుగుప్పలోని ఓ దేవాలయంలో సుధాకర్‌తో పెళ్లి జరిపించాడు.
ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆదోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తన కుమార్తెకు మాయ మాటలు చెప్పి వివాహం చేసుకున్నారని, తనకు కూడా తెలియదని ఫిర్యాదు చేసింది. దీంతో సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, అలాగే పెళ్లి జరిపించిన మరో ఆరుగురిపై బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆదోని రెండో పట్టణ సీఐ సూర్యమోహన్ రావు తెలిపారు. పోక్సో కేసును డీఎస్పీకి పంపామని, నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. పోక్సో కేసు డీఎస్పీ విచారిస్తారని చెప్పారు.
పెళ్లి నిరాకరించడంతో బాలిక తండ్రిని హత్య
ఏలూరులో దారుణమై ఘటన చోటు చేసుకుంది. బాలికపై ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అందుకు బాలిక తండ్రి నిరాకరించాడు. దీంతో ఆయనపై కక్ష పెట్టుకుని పథకం ప్రకారం బాలిక తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపురం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నగరంలోని రామకృష్ణాపురం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి 39వ పిల్లర్ ప్రాంతంలో వెంకటకనకరాజు, నాగమణి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
నాగమణి ఎనిమిదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. వీరి పెద్ద కుమార్తె (12)ను ఏలూరు రూరల్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన నాని అనే యువకుడు ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. భార్య మృతి చెందడంతో ముగ్గురు కుమార్తెలను తీసుకుని కనకరాజు ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉంటున్నాడు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
నారాయణపురం నుంచి కనకరాజు శుక్రవారం రామకృష్ణాపురం ప్రాంతానికి వచ్చాడు. గతంలో తాను నివాసం ఉంటున్న పిల్లర్ నెంబర్ 29 వద్దకు వచ్చి పక్కనే నివాసం ఉంటున్న నాగిరెడ్డి గంగలక్ష్మిని పలకరించాడు. ఈ రోజుకు ఇక్కడే ఉంటానని చెప్పాడు. శుక్రవారం రాత్రి కనకరాజు అక్కడే పడుకున్నాడు. కనకరాజు ఏలూరు వచ్చిన విషయం తెలుసుకున్న నాని, అక్కడకు వచ్చాడు.
కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమని కనకరాజును నాని అడిగాడు. అందుకు కనకరాజు నిరాకరించాడు. దీంతో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శనివారం తెల్లవారుజామున కనకరాజుపై నాని తనతో తెచ్చుకున్న పదునైన చాకుతో దాడి చేశాడు. గొంతుపై పలుమార్లు పొడవడంతో కనకరాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య తర్వాత నాని అక్కడి నుంచి పరారయ్యాడు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)