Hindupuram Municipality: మట్కా, అక్రమ మద్యం కేసులో హిందూపురం వైసీపీ నేత అరెస్ట్
22 August 2023, 8:38 IST
- Hindupuram Municipality: హిందూపురం వైసీపీలో అంతర్గత విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. వైసీపీ ఆధిపత్య పోరులో భాగంగా హిందూపురం మునిసిపల్ ఛైర్‌పర్సన్ భర్తను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
హిందూపురం మునిసిపల్ ఛైర్మన్ భర్త అరెస్ట్
Hindupuram Municipality: వైసీపీలో అంతర్గ త ముదిరిపాకాన పడి ఏకంగా పోలీసు కేసులు పెట్టే వరకు వెళ్ళింది. ఆగష్టు 15న హిందూపురం మునిసిపల్ ఛైర్‌పర్సన్ జెండా ఆవిష్కరించకుండా మునిసిపల్ సహాయ నిరాకరణ చేయడం కలకలం రేపితే తాజాగా ఆమె భర్తను పోలీసులు మట్కా కేసులో అదుపులోకి తీసుకున్నారు.
హిందూపురం వైసీపీ బాధ్యతల్ని ఎమ్మెల్సీ ఇక్బాల్ నుంచి దీపికకు అప్పగించిన తర్వాత స్థానిక రాజకీయాలు మారిపోయాయి. ఇక్బాల్ మనుషులనే కారణంతో మునిసిపల్ ఛైర్‌పర్సన్ వర్గాన్ని దీపిక పక్కన పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి మట్కా కేసులో మునిసిపల్ ఛైర్‌పర్సన్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఇంద్రజ భర్త, వైసీపీ నాయకుడు శ్రీనివాసులుతో పాటు ఆయన అనుచరులు ఐదుగురిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
మునిసిపల్ ఛైర్‌పర్సన్ భర్తపై మట్కా దందా ఆరోపణలు ఉన్నాయి. మట్కా దందా నిర్వహించడంతో పాటు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి విక్రయిస్తున్నారనే ఆరోపణలతో గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. మరోవైపు తమపై అక్రమ కేసులు బనాయించేందుకు హిందూపురం వైసీపీ బాధ్యురాలు దీపిక వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇంద్రజ, ఆమె భర్త చెబుతున్నారు.
దీపిక నాయకత్వానికి అంగీకరించపోవడంతోనే తమను వేధిస్తున్నారని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఇంద్రజ వాపోయారు. ఆగష్ట్ 15న జెండా ఎగురవేయకుండా అడ్డుకున్నారు. దీపికతో విభేదాల నేపథ్యంలో మట్కా, అక్రమ మద్యం విక్రయాల పేరుతో శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు.
హిందూపురం వైసీపీ బాధ్యతలు ఎమ్మెల్సీ ఇక్బాల్ చూసేవారు. గత ఎన్నికల్లో ఇక్బాల్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత హిందూపురంలో జరిగిన వైసీపీ నేతల హత్యల వెనుక ఇక్బాల్ ఉన్నారని ప్రచారం జరిగింది. ఆధిపత్య గొడవలతో నియోజక వర్గంలో పార్టీ ఇబ్బంది పడుతుండటంతో కొత్త ఇంచార్జిని నియమించారు.
దీపిక వచ్చిన తర్వాత ఇక్బాల్‌వ ర్గీయుల్ని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ హయాంలో పార్టీలో ముఖ్య నాయకులైన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి తదితరులపై అప్పట్లో కేసులు పెట్టించడంపై గొడవలు జరిగాయి.
ఇప్పుడు సమన్వయకర్తగా నియమించిన దీపిక కూడా అదే బాటలో నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మునిసిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ కుటుంబంపై మొదటి నుంచీ మట్కా దందా ఆరోపణలున్నాయి. ఇంద్రజ భర్త శ్రీనివాసులుపై మట్కా బీటర్‌గా చాలా ఏళ్ల క్రితమే కేసులు నమోదయ్యాయి.
ఇక్బాల్ బాధ్యతల్లో ఉన్న సమయంలో వీరి దందాకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. మట్కా, కర్ణాటక మద్యం, జూదాలు యథేచ్ఛగా నడిచాయి. దీపిక బాధ్యతల్లోకి వచ్చాక కేసులు భయంతో వాటిని నిలిపి వేశారు. ఈ క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చగా మారింది.