తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Medical Seats Issue: మెడికల్‌ సీట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Ap Medical Seats Issue: మెడికల్‌ సీట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

HT Telugu Desk HT Telugu

11 August 2023, 9:27 IST

google News
    • Ap Medical Seats Issue: ఏపీ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కొత్త మెడికల్ కాలేజీల్లో బి,సి క్యాటగిరీల్లో సీట్లను కేటాయించడం వల్ల   మెరిట్‌ విద్యార్ధులు, రిజర్వుడు విద్యార్ధులకు అవకాశాలు కోల్పోతారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

Ap Medical Seats Issue: ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో బి,సి క్యాటగిరీలు ఏర్పాటు చేసి 50శాతం సీట్లను కేటాయించాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ విధానానికే వ్యతిరేకమని హైకోర్టులో విద్యార్థుల తరఫున న్యాయవాది వాదించారు.

ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేయాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ విధానానికి వ్యతిరేకమని నీట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థుల తరఫున న్యాయవాది హైకోర్టులో వాదించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రభుత్వ రిజర్వేషన్‌ పాలసీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం.. మొత్తం 60 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో బీ, సీ కేటగిరీలకు 50 శాతం సీట్లను కేటాయించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలతో పాటు మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 107,108 జీవోల అమలును నిలిపి వేయాలని కోరారు. అయితే ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సీట్ల భర్తీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల ఓ విద్యార్ధిని విషయంలో ఇచ్చిన ఆదేశాలే ప్రస్తుత పిటిషన్‌కు వర్తిస్తాయని తెలిపింది.

ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది.

ఏపీలోని మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాలల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల సీట్ల భర్తీలో బీ కేటగిరీలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు 35 శాతం, సీ కేటగిరీ ఎన్‌ఆర్‌ఐ సీట్లు 15 శాతంగా విభజించేలా ప్రభుత్వం జీవో నంబర్లు 107, 108లను తీసుకొచ్చింది.

ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ నీట్‌ రాసిన విద్యార్థులు ప్రేమ్‌ సాజన్‌ ‌తో పాటు మరికొందరు హైకోర్టులో తాజాగా మరో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ల తరపున శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా అయిదు కళాశాలల్లో 79 సీట్లు రిజర్వేషన్‌ వర్గాలకు దక్కకుండా పోతాాయన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు తీవ్ర విఘాతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ జీవోల అమలును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది.

తదుపరి వ్యాసం