AP Medical Seats Issue: మెడికల్ సీట్ల వ్యవహారంపై జూనియర్ డాక్టర్ల పోరుబాట..
03 August 2023, 7:23 IST
- AP Medical Seats Issue: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బీ,సీ క్యాటగిరీ సీట్ల రుసుముల వ్యవహారంపై జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. వైద్య విద్యను పేదలకు దూరం చేసేలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పడుతున్నారు.
ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు
AP Medical Seats Issue: ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో బీ, సీ క్యాటగిరీ సీట్ల కేటాయింపును తప్పుబడుతూ ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం నిరసనలకు సిద్ధమైంది. బుధవారమే నిరసనలకు సంబంధించిన నోటీసులను సర్కారుకు అందించింది.
సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 107ను వెనక్కి తీసుకోవాలని జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. వైద్య విద్యకు సంబంధించి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న జూనియర్ డాక్టర్లు ఇప్పటికే పలుమార్లు జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.
జులై 20న హెల్త్ సెక్రటరీ, డీఎంఈలకు, 29న డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు వినతిపత్రాలు అందించారు. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో బుధవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. తాము ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కొత్త మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో సీట్లు కేటాయించడం సరికాదని నోటీసులో పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వైద్య విద్యను దూరం చేసేలా ఉన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమాల కార్యాచరణను వెల్లడించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు డ్యూటీ ముగిసిన తర్వాత అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు.
ఆగష్టు 4వ తేదీన క్యాండిల్ ర్యాలీతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని నిర్ణయించారు. ఆగష్టు 5వ తేదీన కాలేజీల క్యాంపస్ నుంచి బయటకు వచ్చి శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తారు. 6న శాంతియుత నిరసనలతో పాటు మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం నుంచి అప్పటికీ సానుకూల స్పందన రాకుంటే 7వ తేదీ నుంచి విధులు బహిష్కరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంగా ఖచ్చితంగా విద్యార్ధుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, కేవలం డబ్బున్న వారికి మాత్రమే వైద్య విద్యను పరిమితం చేస్తుందని చెబుతున్నారు. కాలేజీల నిర్వహణకు అవసరమైన డబ్బును సమకూర్చుకోడానికి సెల్ఫ్ ఫైనాన్స్ విధానంగా పేర్కొనడాన్ని తప్పు పడుతున్నారు. ఏడాదికి రూ.45కోట్లను కూడా ఖర్చు చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని గుర్తు చేస్తున్నారు.
కొందరికే ఉన్నత విద్యను పరిమితం చేసే కుట్రతోనే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిలో మెడికల్ సీట్లను అమ్ముకోడానికి ప్రయత్నిస్తుందని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.సంపన్న వర్గాలు, ప్రతిభ ద్వారా కాకుండా, ఆర్ధిక ప్రతిపాదికన విద్యను కొనుగోలు చేయగలిగిన వారికి మేలు చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారని జూనియర్ డాక్టర్ల సంఘం ఆరోపిస్తోంది.