AP Medical Seats Issue: జీవో 107,108.. తుది తీర్పుకు లోబడే మెడికల్ సీట్ల భర్తీ
09 August 2023, 9:38 IST
- AP Medical Seats Issue: ఏపీ మెడికల్ కాలేజీ సీట్ల భర్తీలో కొత్త విధానాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 107, 108పై హైకోర్టు కీలక వ్యాఖ‌్యలు చేసింది. కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టినా తుది తీర్పుకు లోబడి సీట్ల కేటాయింపు ఉంటుందని ధర్మాసనం ప్రకటించింది.
మెడికల్ సీట్ల భర్తీపై హైకోర్టు ఉత్తర్వులు
AP Medical Seats Issue: ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపులో 50 శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో కేటాయించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ కాలేజీల్లో 35శాతం బీ క్యాటగిరీ సీట్లు,15శాతం సీ కేటగిరీలో ఎన్నారై సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని పలువురు సవాలు చేశారు.
బీ, సీ క్యాటగిరీలో సీట్ల భర్తీ వ్యవహారం కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని మంగళవారం హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సీట్ల భర్తీ ప్రక్రియను నిలిపివేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.
మెడికల్ సీట్లకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ కేసులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్య సేవలు, మౌలికసదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్, హెల్త్ యూనివర్సిటీ, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ధర్మాసనం కోరింది.
కేసు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల వైద్య కళాశాలల్లో సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 107, 108లను సవాల్ చేస్తూ నీట్ రాసిన విద్యార్థులు కోయ శిరీషతో పాటు మరికొందరు విద్యార్ధులు హైకోర్టును ఆశ్రయించారు.
మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాల్సి ఉండగా, దీనికి భిన్నంగా ప్రభుత్వం బీ, సీ కేటగిరీలను తీసుకువచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ‘‘వైద్య కళాశాలల నిర్మాణం కోసం కేంద్రం 60శాతం నిధులిచ్చిందని, జాతీయ వైద్య కమిషన్ అనుమతి తీసుకోకుండా ప్రభుత్వం బీ, సీ కేటగిరీలను తీసుకొచ్చిందని తెలిపారు"
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకే కాకుండా మెరిట్ విద్యార్థులకు కూడా నష్టం కలిగిస్తుందన్నారు. గతంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేసే వారని, తాజా నిర్ణయంతో బీ కేటగిరీ కింద భర్తీ చేసే సీట్లకు రూ.12 లక్షలు, సీ కేటగిరీ కింద భర్తీ చేసే సీట్లకు రూ.20 లక్షలుగా ఫీజు నిర్ణయించారు. సెల్ఫ్ పైనాన్సింగ్ పేరుతో వైద్య సీట్లను సర్కారు వేలం వేస్తోందని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ జీవోలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘కొత్త కాలేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్ధిక సంస్థల నుంచి రూ.వేల కోట్ల రుణాలు సమీకరించిందని, బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీ ద్వారా వసూలు చేసిన సొమ్మును కళాశాలల నిర్వహణ, ఆరోగ్య రంగంలో మౌలికవసతులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తోందన్న పిటిషనర్ల వాదన సరికాదని, బీ, సీ కేటగిరీ సీట్లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీ, సీ కేటగిరీని ప్రవేశపెడుతూ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. దానిని అమలు చేసి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలించేందుకు అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని అభ్యర‌్ధించారు. దీంతో కౌన్సిలింగ్ యధావిధిగా జరుపుకోవచ్చని అడ్మిషన్లు మాత్ర తుది తీర్పుకు లోబడి ఉంటాయని ధర్మాసనం ప్రకటించింది.