APSDMA : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం… దక్సిణ కోస్తాపై ప్రభావం
06 December 2022, 12:09 IST
- APSDMA బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో ఆ ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడుపై పడనుంది. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల వైపు మాండోస్ తుఫాన్ ప్రయాణిస్తుండటంతో దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం
APSDMA ఏపీ - తమిళనాడు సరిహద్దుల వైపు మాండోస్ తుఫాను ప్రయాణిస్తుండటంతో దక్షిణ కోస్తా తీరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. మంగళవారం నాటికి ఇది వాయుగుండగా మారనుందని, తరువాత మరింత బలం పుంజుకుని తుపానుగా తీరానికి చేరువయ్యే సూచనలు ఉన్నాయని గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారి ఉమాశంకర్ దాస్ చెప్పారు.
డిసెంబర్ 8న తుఫాను తమిళనాడు, పుదుచ్చేరిలకు చేరువలో తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు మంచు కురుస్తుందని తెలిపారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి, బుధవారం మాండోస్ తుఫానుగా మారనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది డిసెంబరు 9కి చెన్నై దగ్గరగా వచ్చి, డిసెంబరు 10న మన ఆంధ్రా - తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని తాకనుంది.
చెన్నైకి ఉత్తర భాగం అయిన ఆంధ్రా - తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తీరాన్ని తాకనుంది. తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా పూర్తి ప్రభావం పడనుంది. ఈదురు గాలులు తుఫాను స్ధాయిలో, వర్షాలు భారీ నుంచి అతిభారీగా పడనున్నాయి. నెల్లూరు, తిరుపతితో పాటు కోస్తాంధ్రలోని అన్ని భాగాల్లో తుఫాను ప్రభావం ఉండనుంది. విశాఖలో కూడ దీని తుఫాను ప్రభావం ఉండనుంది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ లో బలపడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నివారణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌డిఎంఏ సూచించింది
రాయలసీమలోని చిత్తూరు, వైఎస్సార్ , అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం
వర్షాల నేపధ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ
దక్షిణకోస్తాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
టాపిక్