Tirumala : తిరుమలలో భక్తజన సంద్రం…ఐదు కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు
01 October 2023, 9:08 IST
- Tirumala Tirupati Devasthanam Updates: వరుస సెలవు దినాలు రావటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తులకు కీలక అలర్ట్ ఇచ్చింది టీటీడీ.
తిరుమలలో బారులు
Tirumala Tirupati Devasthanam: పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద వున్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుంచి క్యూ లైన్లలో వున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, ఆలయంలోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పల్ స్టాండ్‌లు మొదలైన వాటి వద్ద వివిధ షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేచి ఉన్న యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
సెప్టెంబర్ 30వ తేదీ నాటికి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
సర్వదర్శన టోకెన్లు నిలిపివేత!..
Tirumala Heavy Rush : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1, 7, 8, 14, 15వ తేదీల్లో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.