Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరం, బాలికపై సొంత చిన్నాన్నే అత్యాచారం!
02 November 2024, 22:29 IST
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. బాలికపై సొంత చిన్నాన్నే లైంగిక దాడి చేసి గర్భవతి చేశాడు. వదినలో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె కూతురిపై కన్నేసి చివరికి బాలికను గర్భవతి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాలో ఘోరం, బాలికపై సొంత చిన్నాన్నే అత్యాచారం!
గుంటూరు జిల్లాలో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై సొంత చిన్నాన్నే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి చనిపోవడంతో మాయ మాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన బయటపడింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి భార్య చనిపోవడంతో బాలిక తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఓ గ్రామంలో చోటు చేసుకుంది. సొంత బాబాయి తన అన్న కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన అమానుష ఘటన బయటపడింది. పెదకాకాని సీఐ నారాయణస్వామి కథనం ప్రకారం ఐదో తరగతి వరకు చదువుకున్న బాలిక (14) ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. ఆమె తండ్రి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషిస్తోంది.
బాలిక చిన్నాన్న ఎం.శామ్యూల్ స్థానికంగానే నివాసం ఉంటున్నాడు. అతడు తాపీమేస్ట్రీ కాగా, ఆయన భార్య మృతి చెందింది. దీంతో వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఎనిమిది నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. బాలిక నెలసరి రాకపోవడంతో తల్లికి అనుమానం డాక్టర్‌కు చూపించారు. మూడు నెలల గర్భంతో ఉన్నట్లు వైద్యుడు నిర్ధారించడంతో ఏం జరిగిందని కుమార్తెను తల్లి ఆరా తీసింది. అప్పుడు తనపై చిన్నాన్న చేసిన అకృత్యాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు.
పెదకాకాని పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. బాలికను వైద్య పరీక్షలకు పంపగా మూడు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారని సీఐ నారాయణ స్వామి తెలిపారు. తండ్రిలా బాలిక ఆలనా పాలనా చూడాల్సిన చిన్నాన్నే బాలికపై అత్యాచారం చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
బాలికను ప్రేమించి... ఫోటోలను మార్ఫింగ్...డబ్బులు కోసం బ్లాక్ మెయిలింగ్
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు మైనర్లు ఇన్‌స్టాగ్రాంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. తరువాత సరదాగా బయట కలిసి ఫోటోలు దిగారు. అక్కడి నుంచి అతను తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. డబ్బులివ్వకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిపోయిన బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా వారు దాచిన డబ్బు తీసి అతనికి ఇస్తూ వస్తోంది.
ఇదే అదునుగా అతను పులుమార్లు బెదిరింపులకు గురిచేసి డబ్బు రాబట్టుకుని జల్సాలకు వాడుకున్నాడు. ఇంట్లో దాచిన డబ్బులు తరచూ దొంగతనానికి గురవుతుండటాన్ని గుర్తించి తల్లిదండ్రులు నిఘా పెట్టారు. తమ కుమార్తె ఇంట్లో దాచిన డబ్బు తీస్తుందని తెలుసుకుని, కుమార్తెను తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో జరిగిన పరిణామాలను తల్లిదండ్రులకు వివరించింది.
తనకు మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన బాలుడితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడిందనీ, అతను తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తుండటంతో డబ్బులు తీసుకెళ్లి ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు ఒంగోలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు