Kadapa Crime: కడప జిల్లాలో ఘోరం...మద్యం మత్తులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...పోక్సో కేసు నమోదు
Kadapa Crime: కడప జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలను మర్చిపోయి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Kadapa Crime: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం పరిధిలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా బయట పడింది. పెద్దముడియం ఎస్ఐ సుబ్బారావు కథనం ప్రకారం ఆ గ్రామంలో ఒక కుటుంబంలో దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె (16) పదో తరగతి వరకూ చదివి తల్లితో పాటు కూలి పనులకు వెళుతోంది.
ఆమె తండ్రి హమాలీ పనికి వెళ్తూ మద్యానికి బానిస అయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య లేదు. కూతురు ఒక్కతే ఉంది. భార్య లేకపోవడంతో మద్యం మత్తులో కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజులుగా కూతురు అనారోగ్యంగా ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో తండ్రి చేసిన అకృత్యాన్ని కూతురు బయట పెట్టింది.
దీంతో మంగళవారం సాయంత్రం భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని ఆ గ్రామస్తులు చీకొడుతున్నారు.
అక్క చెల్లిళ్లుపై లైంగిక దాడి...నిందితుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా
అక్కా చెల్లెళ్లపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు ఇచ్చారు. బాలికలకు నిందితుడు రూ.లక్ష చొప్పున చెల్లించాలని, ప్రభుత్వం చెరో రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ప్రకారం వివాహితుడైన అమరావపల్లి అరవింద్ (25) పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర వుడా కాలనీలో నివసిస్తున్నాడు.
నిందితుడు అరవింద్ ఇంటికి సమీపంలో బీసీ కాలనీ దగ్గర బాధిత కుటుంబ ఉండేంది. ఆ కుటుంబంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు ఉంటారు. నిందితుడు బాలికలతో చాలా చనువుగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో ముందుగా పెద్ద బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2019 జులైలో తల్లికి తెలియకుండా ఇద్దరు బాలికలను తన కారులో ఒంగోలు తీసుకెళ్లాడు.
అక్కడ ఇద్దరిపైన లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. విషయం తెలియడంతో బాలికల తల్లి 2019 నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ స్వరూపరాణి దర్యాప్తు చేసి ఛార్జీషీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన విశాఖపట్నం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనంది నిందితుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాలికలకు నిందితుడు రూ.లక్ష చొప్పున చెల్లించాలని, ప్రభుత్వం చెరో రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు.
బాలికను నమ్మించి గర్భవతి చేసి మోసం...పోక్సో కేసులో నిందితుడు అరెస్టు
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బాలికను నమ్మించి గర్భవతి చేసిన యువకుడును పోక్సో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న సారవకోట మండలంలో ఒక గ్రామానికి చెందిన బాలికను నమ్మించి గర్భవతి చేసిన కురిడింగి గ్రామానికి చెందిన అలికాపు తిరుమలపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇతర సెక్షన్ల కింద కేసులు దాఖలు అయ్యాయి. అయితే పరారీలో ఉన్న నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాతపట్నం రిమాండ్‌కు తరలించినట్లు ఎఎస్ఐ లక్ష్మీనరసింహ తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)