Krishna Crime : రూ.500 కోసం భార్యాభర్తల మధ్య వివాదం, ఇద్దరూ ఆత్మహత్య!
20 January 2024, 21:59 IST
Krishna Crime : కృష్ణా జిల్లా గుడివాడలో స్వల్ప విషయానికి దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. రూ.500 విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు.
గుడివాడలో దంపతుల ఆత్మహత్య
Krishna Crime : కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. గుడివాడలో రూ.500 కోసం దంపతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు గుడివాడ వాసవీనగర్‌లో నివసిస్తున్నారు. అయితే మద్యానికి బానిసైన రాంబాబు తరచూ ఇంట్లో గొడవపడేవాడు. రాంబాబు ప్రస్తుతం ఏలూరులోని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ కుమారుడిని డబ్బుల అడిగేవాడు రాంబాబు. స్థానికంగా మెకానిక్‌గా పనిచేస్తున్న కుమారుడు గౌతమ్‌కు రాంబాబుకు రూ.6 వేలు వరకు పంపాడు. మళ్లీ రూ.500 కావాలని భార్యను అడగడంతో రాంబాబు, కనకదుర్గ ఇద్దరి గొడవ జరిగింది.
దంపతుల ఆత్మహత్య
రాంబాబు, భార్యతో గొడవపడి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాంబాబు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రి చనిపోయాడని కుమారుడు తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. భర్త మరణవార్తను విని తట్టుకోలేకపోయిన భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగివచ్చి చూసేసరికి కనకదుర్గ విగతజీవిగా కనిపించింది. స్వల్ప వివాదంతో దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
డాక్టర్ దంపతుల ఆత్మహత్య
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధల తట్టుకోలేక డాక్టర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్న దంపతులు... అప్పుల బాధతో సూసైడ్ చేసుకుంటున్నట్లు నోట్ రాశారు. సాగర్ జల్లాలోని బినా పట్టణంలో నివాసం ఉంటున్న వైద్య దంపతులు బల్బీర్, మంజు కైథోరియా శనివారం వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. వారి కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే సరికి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని కుమారుడు పోలీసులకు తెలియజేశాడు.
పోలీసులు ఇంటికి చేరుకునే సమయానికి వైద్యుడు బల్బీర్ ఉరి వేసుకుని ఉండగా, అతని భార్య మంజు బెడ్ పై విగతజీవిగా పడిఉంది. ఆమె విషం తాగి లేదా ఇంజెక్షన్ చేసుకుని చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో పోలీసులకు ఒక సూసైడ్ లేఖను దొరికింది. అందులో అప్పుల బాధ వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉంది. వైద్య దంపతుల ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.