తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Updates: తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

Tirumala Updates: తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

HT Telugu Desk HT Telugu

28 September 2023, 11:43 IST

google News
    • Tirumala Updates: తిరుమలలో గురువారం నాడు అనంతపద్మనాభ వ్రతం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు.
తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం
తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

Tirumala Updates: తిరుమలలో గురువారం అనంతపద్మనాభ వ్రతం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు. అక్కడ చక్రత్తాళ్వార్లకు అభిషేకాదులు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

ప్రతి సంవత్సరం బాధ్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంత పద్మనాభ స్వామివ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మివ్రతం ఎలా చేస్తారో, పురుషులకు సిరిసంపదల కోసం అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు.

పాలసముద్రంలో శేషశయ్య మీద పవళించి ఉండే దివ్యమంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు.తిరుమలలో సెప్టెంబ‌రు 28వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం 6 గంట‌లకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు గావించారు.

అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

శ్రీ మహావిష్ణువు అనంత కోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశ వ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.

తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం