Pvt School Permissions: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు ఇకపై ఆన్‌లైన్‌లోనే అనుమతులు
18 October 2023, 6:36 IST
- Pvt School Permissions: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఆన్‌లైన్‌లో మాత్రమే అనుమతి మంజూరు చేస్తామని, ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశించారు.
ప్రైవేట్ స్కూళ్లకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు
Pvt School Permissions: ప్రైవేటు పాఠశాలల అనుమతి మంజూరు కేవలం ఆన్ లైన్ ద్వారానే మాత్రమే ఇస్తామని, ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలపై, సూచనలు సలహాల గురించి ఏడు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ అసోషియేషన్ ప్రతినిధులతో సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
పాఠశాలలకు అనుమతి, గుర్తింపునకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా సకాలంలో చలానా చెల్లింపులు, పోర్టల్‌లో సమస్యలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు- సిబ్బంది సమస్యలు, పీఎఫ్, ఆరోగ్య భీమా, ఈఎస్ఐ హెల్త్ కార్డు, ఉద్యోగుల జీతాల చెల్లింపు, గుర్తింపు- కాలం పొడిగింపు, వార్షిక పరిపాలన నివేదిక, ఫీజులు, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.
ఇతర సంస్థల ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) వంటివి అప్ లోడ్ చేయడానికి పోర్టల్ పునరుద్ధరణ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన వార్షిక అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టులను సంబంధిత విద్యాశాఖాధికారులకు సమర్పించాలని కోరారు.
ప్రైవేటు పాఠశాలల నోటీసు బోర్డులో తరగతి వారీగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ప్రదర్శించాలని ఆదేశాలిచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి అయా సంఘాల ప్రతినిధులకు కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.