తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tidco Housing: టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త, జూన్‌లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగింత..

TIDCO Housing: టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త, జూన్‌లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగింత..

24 December 2024, 5:30 IST

google News
    • TIDCO Housing: ఐదేళ్లుగా టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  2025 జేన్‌ నాటికి రాష్ట్రంలో 1.18లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఇందుకోసం రూ.102 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 
రాజధాని ప్రాంతంలో నిర్మాణం పూర్తైన టిడ్కో ఇళ్ళు
రాజధాని ప్రాంతంలో నిర్మాణం పూర్తైన టిడ్కో ఇళ్ళు

రాజధాని ప్రాంతంలో నిర్మాణం పూర్తైన టిడ్కో ఇళ్ళు

TIDCO Housing: ఇళ్ల కేటాయింపు పూర్తై, బ్యాంకు రుణాలు మంజూరైనా ఐదేళ్లుగా ఇళ్లు చేతికి అందని టిడ్కో లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బ్యాంకు రుణాలు చెల్లించలేక, ఇళ్లు దక్కక, నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.102 కోట్లను చెల్లించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. జూన్ 12 కల్లా రాష్ట్రంలో 1.18 లక్షల టిడ్కో గృహాలు పూర్తికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

వచ్చే ఏడాది జూన్ 12 వ తేదీ కల్లా 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 44 వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు మరియు టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించారు.

ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని నాన్ పెర్పార్మింగ్ ఎస్సెట్స్ గా మిగిలి పోయిన టిడ్కో గృహాలను పూర్తి చేయడానికి రూ.102 కోట్లను చెల్లించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని వివరించారు. 2014-19 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏపీలో 7,01,481 టిడ్కో ఇళ్ళను మంజూరు చేయించి, వాటిలో 5 లక్షల గృహాలకు పరిపాలనాపరమైన అనుమతులను కూడా మంజూరు చేసినట్టు వివరించారు.

మంజూరైన వాటిలో 4,54,706 గృహాలను గ్రౌండ్ చేయడం జరిగిందని అందులో 2019 నాటి 3,13,832 గృహా నిర్మాణాలను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి యూనిట్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.3.90 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించగా, అందులో రూ.1.90 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా నిర్ణయించామన్నారు.

లబ్దిదారుని వాటాగా చెల్లించాల్సిన సొమ్మును బ్యాంకు రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపట్టామని, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రక్రియను అంతా గందర గోళం చేశారన్నారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం టెండర్లు పిలిచి నిర్మాణానికి చేపట్టిన 4,54,706 ఇళ్లలో 2,61,640 గృహాలను మాత్రమే గత ప్రభుత్వం చేపట్టి మిగిలిన వాటిని రద్దు చేసిందన్నారు. ఆ ఇళ్లను కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.

ఈ ఇళ్లలో దాదాపు 77 వేల గృహాలను తమ ప్రభుత్వమే పూర్తి చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులకు మంజూరు చేసిన గృహాలపై గత ప్రభుత్వం బ్యాంకు ఋణాలను తీసుకుని, ఆ సొమ్మును డైవర్టు చేయడంతో ఆయా ఇళ్లు నాన్ పెర్పార్మింగ్ ఎస్సెట్ట్సుగా మిగిలిపోయాయన్నారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే రూ.102 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆ సొమ్మును ప్రభుత్వం చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెల్పారన్నారు.ఈ డబ్బుతో దాదాపు 1.18 లక్షల గృహా నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ 12 కల్లా పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

రూ.2,723 కోట్లతో అమరావతి జోన్-7,10 లే అవుట్ల రోడ్ల నిర్మాణం....

అమరావతి జోన్-7 మరియు 10 లే అవుట్ల రోడ్ల నిర్మాణ పనులను రూ.2,723 కోట్లతో చేపట్టేందుకు సీఆర్డీఏ ఆమోదం తెల్పినట్లు మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్దికై ఇప్పటి వరకూ రూ.47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం లభించిందని, మిగిలిన అభివృద్ది పనుల్లో కొన్నింటికి ఈ నెలాఖరు లోపు, మిగిలిన వాటికి వచ్చేనెలలోపు ఆమోదం లభిస్తుందని, వచ్చే నెల 15 వ తేదీలోగా అన్ని పనులకు టెండర్లు పిలిచి పనులను చేపడతామన్నారు.

తదుపరి వ్యాసం