తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ntr Bharosa Pensions: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌… కొత్త పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణ ముహుర్తం ఖరారు…

NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌… కొత్త పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణ ముహుర్తం ఖరారు…

15 November 2024, 6:43 IST

google News
    • NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే కొత్త పెన్షన్ల జారీకి సిద్ధం అవుతోంది. శాసనసభ సమావేశాల్లో కొత్త పెన్షన్ల జారీపై పలువురు సభ్యులు ప్రస్తావించడంతో  త్వరలో జారీ చేయనున్నట్టు సెర్ప్‌ మంత్రి వివరణ ఇచ్చారు. అనర్హుల ఏరివేత ప్రక్రియను కూడా చేపడుతున్నారు. 
కొత్త పెన్షన్ల జారీపై అధికారులతో చర్చిస్తున్న మంత్రి శ్రీనివాస్
కొత్త పెన్షన్ల జారీపై అధికారులతో చర్చిస్తున్న మంత్రి శ్రీనివాస్

కొత్త పెన్షన్ల జారీపై అధికారులతో చర్చిస్తున్న మంత్రి శ్రీనివాస్

NTR Bharosa Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షనార్దుల నుంచి డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కొత్తగా పెన్షన్లకు అర్హులైన వ్యక్తులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో మంత్రి శ్రీనివాస్ ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక పెన్షన్ దారులు పెన్షన్ పంపిణీ సమయంలో గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని, వరుసగా మూడు నెలల పాటు గ్రామంలో అందుబాటు లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా ఆపేస్తారని తర్వాత కాలంలో వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి లేదా వీల్ చైర్ కు పరిమితమైన వారు పొందే పెన్షన్ లలోను, వికలాంగుల పెన్షన్లలో అనేకమంది అనర్హులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని పునఃసమీక్షించి, సంబందిత శాఖ అధికారులతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తొలగించిన పెన్షన్ల మాటేమిటి?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఉన్న కుటుంబాలకు పెన్షన్లను రద్దు చేశారు. రూ25వేల లోపు జీతాలు ఉన్న ఉద్యోగుల ఇళ్లలో పెన్షన్లను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌లో చిన్నచితక ఉద్యోగాలు చేస్తున్నారనే సాకుతో లక్షలాది మందికి వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు తొలగించింది. రేషన్‌ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులందరిని ఒకే యూనిట్‌గా పరిగణించడంతో ఈ సమస్య ఏర్పడింది. కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇంట్లో వృద్ధులు గ్రామాల్లోనే నివాసం ఉన్నా పెన్షన్లు రద్దు చేశారు. పట్టణాల్లో నామ మాత్రపు జీతాలతో పని చేస్తూ తమ వల్ల కుటుంబాలక పెన్షన్ భరోసా కోల్పోయిన వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

3లక్షల మంది అనర్హులు గుర్తింపు…

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 3లక్షల మంది అనర్హులకు సామాజిక పెన్షన్లు అందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో గురువారం ప్రకటించారు. ప్రభుత్వం వద్ద కొత్తగా రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మంత్రి సమాధానంపై స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుని అనర్హులకు పెన్షన్ల పంపిణీపై ఏమి చర్యలు తీసుకుంటున్నారని, వికలాంగుల పెన్షన్లలో అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై ఏం చేస్తారని మంత్రిని ప్రశ్నించారు.

పెన్షన్ల అర్హత మీద కొత్త ప్రభుత్వం జరిపిన పరిశీలనలో 3లక్షల పెన్షన్లకు అనర్హత పొందాయని, మరో 2.5లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. అర్హత లేని వారికి చెల్లించడం, వికలాంగుల్లో అర్హత లేని వారికి ధృవీకరణ ఇచ్చారని, వాటిని సరిచేయాలని స్పీకర్‌ సూచించడంతో చర్యలు చేపడుతున్నట్టు మంత్రి వివరణ ఇచ్చారు.

రాష్ట్రంలో 8లక్షల మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయని వాటన్నింటిని వెరిఫై చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖలతో తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. పెన్షనర్లలో భార్య భర్తల్లో ఎవరైనా మరణిస్తే స్పౌస్‌ పెన్షన్‌ జారీ చేసేందుకు, అలాంటి వారికి బకాయిలు చెల్లించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ వివరించారు.

తదుపరి వ్యాసం