Godavari Express Golden Jubilee: గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు యాభై ఏళ్లు.. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
02 February 2024, 9:17 IST
- Godavari Express Golden Jubilee: గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు వేడుకలా గోల్డెన్ జూబిలీ నిర్వహించారు.
యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్
Godavari Express Golden Jubilee: యాభై ఏళ్ల క్రితం పట్టాలపై పరుగులు తీయడం ప్రారంభించినప్పటి నుంచి చెక్కు చెదరని ప్రయాణికుల ఆదరణ దక్కించుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్ యాభై ఏళ్ల మైలురాయిని అధిగమించింది. దీంతో రెండు రైల్వే జోన్ల పరిధిలో ప్రతి స్టేషన్లో గోదావరి సంబరాలు నిర్వహించారు.
విశాఖలో మొదలై హైదరాబాద్ చేరుకునే గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలపై ప్రయాణం ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో భారతీయ రైల్వే వేడుకగా దాని పుట్టిన రోజు నిర్వహించింది.
అరుదైన గౌరవం దక్కించుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను అందంగా ముస్తాబు చేసి వేడుకలు నిర్వహించారు. విశాఖలో ప్రారంభమై గోదావరి జిల్లాలను దాటుకుని విజయవాడ దిశ మార్చుకుని హైదరాబాద్‌కు పరుగులు తీసే రైలుకు ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి.
భారతీయ రైల్వేలలో అనేక దశలను చూసిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో దానితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్లేందుకు అన్ని జిల్లాల వారికి అనువుగా ఉండేలా 1974లో గోదావరి ఎక్స్‌ప్రెస్ 12727/12728 రైలు ప్రారంభమైంది. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైలుగా పలు దశలు దాటుకుంది.
యాభై ఏళ్లుగా నిర్విరామంగా గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ - హైదరాబాద్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రొఫెసర్ వైఆర్.రెడ్డి ఆధ్వర్యాన విశాఖ రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
1974 ఫిబ్రవరి ఒకటిన మొదటి సారిగా ప్రారంభించిన గోదావరి ఎక్స్‌ప్రెస్ వాల్తేర్ – సికింద్రాబాద్ మధ్య ట్రైన్ నంబర్ 7007గా, సికింద్రాబాద్ – వాల్తేర్ మధ్య ట్రైన్ నంబర్ 7008గా ప్రవేశపెట్టారు. ఈ రైలు మార్గమధ్యలో 18 స్టేషన్లో ఆగుతుంది. విశాఖ నుంచి హైదరాబాద్ప్ర యాణ దూరం 710 కిలోమీటర్లకు (440 మైల్స్) ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు పడుతుంది.
17 భోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 2011లో సూపర్ ఫాస్ట్ రైలుగా అవతరించింది. 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు సేవలు అందించింది. ప్రస్తుతం గోదావరి ఎక్స్‌ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్లతో విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది.
హైదరాబాద్-విశాఖపట్నం మధ్య విమానాలు అంతగా లేని సమయంలో ఈ రైల్లో సీటు లభించడం రాజభోగంతో సమానంగా భావించేవారు. వివిఐపిలు, రాజకీయ, సినీ ప్రముఖుల రాకపోకలకు ఈ రైలే దిక్కయ్యేది. కొత్తగా ఎన్ని రైళ్లు విశాఖ-హైదరాబాద్ మధ్య వచ్చినా గోదావరికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ నిత్యం వెయిటింగ్ లిస్ట్‌లోనే ఎదురు చూడాల్సి వస్తుంది.
విశాఖ మీదుగా విజయవాడ వచ్చే వారికి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి ప్రధాన రైలు కావడంతో నిత్యం నూరుశాతం ఆక్యునెన్సీతో నడుస్తుంది. గోల్డెన్ జూబిలీ సందర్భంగా విశాఖ స్టేషన్‌లోని ప్లాట్‌ఫార్మ్‌పై రైల్వే అధికారులు, ప్రజలు కేక్ కట్ చేశారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఈ రైలుకు విజయవాడలో కూడా ప్రయాణికుల మధ్య సంబరాలు నిర్వహించారు. ఆ రైలుతో అనుబంధం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది, రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్లాట్‌ఫాంపై ప్రయాణికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.