Dhankonda Durga Temple: మహిమాన్వితం ధనకొండ దుర్గమ్మ ఆలయం.. మొగల్రాజపురం కొండపై నవరాత్రులు
04 October 2024, 3:00 IST
- Dhankonda Durga Temple: ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోన్న విజయవాడలో చారిత్రాత్మకం కలిగిన ఆలయాల్లో మొగల్రాజపురం ధనకొండ దుర్గాభవానీ ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నమ్ముతారు. పురాతన చరిత్ర కల్గిన ఈ ధనకొండ విశిష్టతపై ప్రత్యేక కథనం...
ధనకొండ ఆలయంలో దుర్గమాత
Dhankonda Durga Temple: ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొలువు తీరడానికి ముందు ఇంకోచోట వెలిసిందని భక్తుల నమ్మకం. "దక్షిణాన కదిలిందిరా మా అమ్మ దుర్గా ఉత్తరానికొచ్చింది రా" అని భక్తుల నోట అసువుగా పాడుకునే పాటల్లో కనకదుర్గను కీర్తిస్తూ ఉంటారు. దుర్గా మాత దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండపైన వెలిసిందని స్థానిక భక్తుల విశ్వాసం. ఈ విషయం ఇప్పటి తరంలో చాలా మందికి పెద్దగా తెలీదు.
విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండపై వెలసిందని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందని విశ్వసిస్తారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంతటి మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంతే మహిమగలదని భక్తుల విశ్వాసం.
మొగల్రాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీకచ్రకపీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ రూపం కనపడదు.. అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది.
స్థానికుల కధనం ప్రకారం దశాబ్దాల క్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి, నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. అమ్మ కరుణించి కొంత ధనాన్నిని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు... ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని.. చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందట.
గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగాడట. వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువుగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది. ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆపై నుంచి గుడి వరకు సిమెంట్ రోడ్డు ఉంది.
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు పైన పొంగళ్లు చేసుకొవడానికి షెడ్డు, కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతార్భగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే మొగల్రాజపురంలోని బోయపాటి మాధవరావు రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్లవచ్చు.
ప్రతి ఏటా ఇక్కడ నవరాత్రుల పాటు అమ్మవారికి ఉత్సవాలు చేయడం ఆనక దసరా పండగ రోజున మేళతాళాలు, మంగళవాయిద్యాలతో అమ్మవారిని నగర పురవీధుల్లతో ఊరేగింపు జరపడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి మహత్యం తెలిసిన భక్తులు దసరా ఉత్సవాల సమయంలో ఇక్కడికి విచ్చేస్తూ ధనకొండపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకుని వెళుతుంటారు. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఆలయ ధర్మకర్తలుగా ఆలయాభివృద్ధిలో కృషి చేశారు.