తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gayatridevi Alankaram: ఇంద్రకీలాద్రిపై పంచ ముఖాలతో సంధ్యావందన అధిష్టానదేవతగా గాయత్రీదేవి దర్శనం

GayatriDevi Alankaram: ఇంద్రకీలాద్రిపై పంచ ముఖాలతో సంధ్యావందన అధిష్టానదేవతగా గాయత్రీదేవి దర్శనం

04 October 2024, 4:00 IST

google News
    • క్రోధి నామసంవత్సరం ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల్లో రెండో రోజు అశ్వయుజశుద్ధ విదియ శుక్రవారం అమ్మవారు గాయత్రీ దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.గాయత్రీ దేవి అలంకారంలో అమ్మ వారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. 
పంచముఖాలతో గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు
పంచముఖాలతో గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు

పంచముఖాలతో గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు

"గాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృంద నిషేవితా"

ఓం బ్రహ్మకుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణీం

సర్వతత్త్వమయీం వందే గాయత్రీంవేదమాతరమ్||

శ్రీ గాయత్రీ దేవతాయైనమః అంటూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు అశ్వయుజ శుద్ధ విదియనాడు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు.

సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందిన ఈ గాయత్రీదేవి. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవత. ఈ గాయత్రీదేవి మంత్రప్రభావం ఎంతో గొప్పది. బ్రాహ్మణులైన ప్రతివారు తప్పనిసరిగా ధరించాల్సింది జంథ్యం, తప్పని సరిగా ధ్యానించాల్సింది గాయత్రీమంత్రం.

ఈ గాయత్రీమంత్రం రెండు విధాలుగా వుంటుంది. ఒకటి లఘు గాయత్రీ మంత్రం. మరొకటి బృహద్గాయత్రీమంత్రం. మనం ప్రతిరోజూ త్రికాల సంధ్యావందనంచేసి, ఆ గాయత్రీదేవి మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహం వల్ల వాక్సుద్ధి కలుగుతుంది.

"గాయంతాం రయతీతిగాయత్రి"గా అంటే గానం చేసే వారిని (తనరూపాన్ని) రక్షించేది అని. గాయత్రికి పేరు…. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో “వాగ్వైగాయత్రీ” అంటే మనంమాట్లాడే వాక్కే గాయత్రి అనే అర్థం చెప్పబడింది. ఇలా సకల మంత్రాలకీ, అనుష్ఠానాలకీ, వేదాలకీ మూలమైన దేవతగా గాయత్రీదేవి లోకంలో ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ గాయత్రీ మాత గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చాలు, లోకంలో వ్యవహారంలోవున్న సమస్త దేవతామంత్రాలకీ ఈ గాయత్రీ మంత్రంలో అనుబంధం. వుంది. అందుకే ఆయా దేవతల మూలమంత్రాలతో గాయత్రిని చేర్చి, రుద్రగాయత్రి, లక్ష్మీగాయత్రి, విష్ణుగాయత్రి, అని గాయత్రీమంత్రాన్ని కలిపి చెబుతారు.

సమస్తమైన దేవతలందరికీ నివేదన చేయబోయే పదార్థాలన్నీ గాయత్రీమంత్రంతో సంప్రోక్షణ చేసిన తరవాతే ఆయా దేవుళ్ళకి నివేదన చేస్తారు. అటువంటి మహత్తరశక్తి కలిగిన గాయత్రీదేవిగా శరన్నవ రాత్రుల్లో ఐదుముఖాలతో వరదా భయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా కనకదుర్గమ్మ మనకి దర్శనమిస్తుంది. ఆవేద మాతని ఒక్కసారి ఇలా ధ్యానం చేయండి.

"గాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృంద నిషేవితా"

ఓం బ్రహ్మకుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణీం

సర్వతత్త్వమయీం వందే గాయత్రీంవేదమాతరమ్|| అంటూ ప్రార్థించాలి.

తదుపరి వ్యాసం