తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో తప్పుకున్న సవాంగ్

APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో తప్పుకున్న సవాంగ్

Sarath chandra.B HT Telugu

04 July 2024, 7:22 IST

google News
    • APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి మాజీ ఐపీఎస్‌ అధికారి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ అమోదించారు. 
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్

APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. సవాంగ్‌ రాజీనామాను గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం ఆమోదించినట్టు తెలుస్తోంది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్పీ ఠాకూర్‌ స్థానంలో సవాంగ్‌ను డీజీపీగా నియమించారు. 2018లో డీజీపీ నియామకం జరిగిన సమయంలో ఠాకూర్‌, సవాంగ్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. చివరకు చంద్రబాబు ఠాకూర్‌ వైపు మొగ్గు చూపారు. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారని ప్రచారం జరిగింది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఠాకూర్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించి సవాంగ్‌కు బాధ్యతలు అప్పగించారు. దాదాపు మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. సవాంగ్‌ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని భావించిన జగన్ సర్కారు ఆయన్ని పదవి నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై సవాంగ్ మనస్తాపాని గురయ్యారని ప్రచారం జరగడంతో ఆయనతో రాజీనామా చేయించి ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.

2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు డీజీపీ పదవిలో ఉన్న ఆయన రెండేళ్ల ముందే ఐపీఎస్‌ సర్వీసుకు రాజీనామా చేశారు. ఆ వెంటనే నాటి ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. 2022 మార్చిలో ఏపీపీఎస్సీ బాధ్యతలు చేపట్టారు.

డీజీపీగా కొనసాగిన సమయంలో సవాంగ్ వైసీపీ అనుకూల ముద్ర వేసుకున్నారు. అంతకు ముందు విజయవాడ సీపీగా కొనసాగిన సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. డీజీపీ పదవి వచ్చిన తర్వాత చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడి చేయడం, టీడీపీ నాయకులపై దాడులను ఊపేక్షించారనే విమర్శలు ఉన్నాయి.

సవాంగ్ పదవీ కాలంలో చేపట్టిన ఉద్యోగ నియమకాలు సైతం రాజకీయ ఒత్తిళ్లతో చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి పూర్తిగా లొంగిపోయి ఏపీపీఎస్సీ ప్రతిష్టను మసకబార్చరనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. నమ్మకస్తులైన మాజీ పోలీస్ అధికారుల్ని ఏపీపీఎస్సీలో ఓఎస్డీలుగా నియమించుకుని పనులు చక్కబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయనకు పదవీ గండం తప్పదని భావించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలకు అందకముందే తప్పుకోవడం మంచిదని భావించి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడ సీపీగా పని చేసిన సమయంలో సైతం సిబ్బందిని తీవ్రంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం