తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal News : నంద్యాల జిల్లాలో విషాదం - మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి..!

Nandyal News : నంద్యాల జిల్లాలో విషాదం - మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి..!

HT Telugu Desk HT Telugu

02 August 2024, 9:06 IST

google News
    • Slab Collapsed in Nandyal District : ఇంటి మిద్దె కూలటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలోని చాగ‌ల‌మ‌ర్రి మండ‌ల పరిధిలో జరిగింది.
నంద్యాల జిల్లాలో పెను విషాదం
నంద్యాల జిల్లాలో పెను విషాదం

నంద్యాల జిల్లాలో పెను విషాదం

నంద్యాల జిల్లాలో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంటి మిద్దె ఒకే కుటుంబంలో న‌లుగురిని మింగేసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు.

ఈ ఘోర విషాద సంఘ‌ట‌న నంద్యాల జిల్లా చాగ‌ల‌మ‌ర్రి మండ‌లం చిన్న వంగ‌లి గ్రామంలో గురువారం అర్థ‌రాత్రి చోటు చేసుకుంది. ఇటీవ‌లి భారీగా కురిసిన వ‌ర్షాల వ‌ల్ల ఇంటి మ‌ట్టి మిద్దె బాగా నానిపోయి ఒక్క‌సారిగా కూలిపోయింది. దీంతో ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది. కుటుంబ స‌భ్యులు, బంధువుల క‌న్నీరు మున్నీరుతో ఆ గ్రామంలో రోద‌న‌లు మిన్నంటాయి.

నంద్యాల జిల్లా చాగ‌ల‌మ‌ర్రి మండ‌లం చిన్న వంగ‌లి గ్రామంలో భార్య భ‌ర్త‌లు గురుశేఖ‌ర్ రెడ్డి (45), ద‌స్త‌గిర‌మ్మ (38), ఇద్ద‌రు కుమార్తెలు ప‌విత్ర (16), ప్ర‌స‌న్న (13), గురుల‌క్ష్మి (10) ఉంది. ఇందులో రెండో కుమార్తె ప్ర‌స‌న్న క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఉషోద‌య పాఠ‌శాల‌లో చ‌దువుతోంది. మిగిలిన ఇద్ద‌రు కుమార్తెలు ఇంటి వ‌ద్దే ఉండి చ‌దువు కుంటున్నారు.

గురువారం రాత్రి కుటుంబ స‌భ్యులు నాలుగురు ఇంట్లో ప‌డుకున్నారు. ఇటీవ‌లి భారీ వ‌ర్షాల‌తో ఇంటి మ‌ట్టి మిద్దె బాగా త‌డిసి నానింది. కుటుంబ స‌భ్యులు ఇంట్లో నిద్రిస్తుండ‌గా అర్థ‌రాత్రి ఒక్క‌సారిగా ఇంటి మ‌ట్టి మిద్దె కూలిపోయింది. అర్థ‌రాత్రి కావ‌డంతో చుట్టుప‌క్కల వారు ఎవ్వ‌రూ చూడ‌లేదు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున మ‌ట్టిమిద్దె కూల‌డం గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే కూలిన శిథిలాల‌ను తొల‌గించారు. అప్ప‌టికే గ్రామంలో అందరికి ఈ ఘ‌ట‌న స‌మాచారం అందింది. దీంతో అంద‌రూ అక్క‌డికి చేరుకున్నారు. గ్రామ ప్ర‌జ‌లు అక్క‌డ గుమిగూడారు.

కూలిన మ‌ట్టి మిద్దె శిథిలాల‌ను తొల‌గించిన త‌రువాత మృత దేహాల‌ను వెలికి తీశారు. మృతి చెందిన వారిగా భార్య భ‌ర్త‌లు గురుశేఖ‌ర్ రెడ్డి (45), ద‌స్త‌గిర‌మ్మ (38), ఇద్ద‌రు కుమార్తెలు ప‌విత్ర (16), గురుల‌క్ష్మి (10)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో న‌లుగురు ఒక్క‌సారిగా మ‌ర‌ణించ‌డ‌తో ఆ గ్రామంలో విషాద చాయ‌లు అల‌ముకున్నాయి. బంధువులు, కుటుంబ స‌భ్యులు రోద‌న‌ల‌తో గ్రామమంతా నిశబ్ధంగా మారింది.

ఈ విష‌యాన్ని స్థానికులు పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన‌ అక్క‌డికి చేరుకున్నారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. స్థానికులను వివ‌రాలు అడిగిన తెలుసుకున్నారు. కేసు న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభించారు. నాలుగు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం చాగ‌ల‌మ‌ర్రి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం