తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Attack On Perni Nani : గుడివాడలో హైటెన్షన్.. మాజీమంత్రి పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి

Attack on Perni Nani : గుడివాడలో హైటెన్షన్.. మాజీమంత్రి పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి

01 September 2024, 17:21 IST

google News
    • Attack on Perni Nani : గుడివాడలో మాజీమంత్రి పేర్ని నానిపై కోడి గుడ్లతో దాడి జరిగింది. జనసేన కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య వాగ్వాదం జరిగింది.
దాడిలో ధ్వంసమైన పేర్ని నాని కారు
దాడిలో ధ్వంసమైన పేర్ని నాని కారు

దాడిలో ధ్వంసమైన పేర్ని నాని కారు

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి పేర్నినాని కారుపై జనసేన నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి పేర్ని నాని వచ్చారు. ఈ సమయంలో దాడి జరిగింది. రాళ్ల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు పగిలిపోయాయి. పవన్‌పై అనుచితవ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

అసలు ఏం జరిగింది..

ఫోటోలు మార్ఫింగ్ చేసి.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌పై అనుచిత పోస్టులు చేస్తున్నారని.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌ను గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇంటూరి రవి కిరణ్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు అయ్యింది. ఆయన్ను బయటకు తీసుకురావడానికి పేర్ని నాని, ఇతర వైసీపీ నేతలు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఇంటూరి రవి కిరణ్‌పై దాడికి ప్రయత్నించారు. పక్కనే ఉన్న పేర్ని నానిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దాడి చేశారు.

పోలీసుల ఎంట్రీ..

దాడి చేసిన జనసేన కార్యకర్తలు.. పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పేర్ని నాని, ఇంటూరి రవి కిరణ్, ఇతర నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిపై వైసీపీ స్పందించింది. ఇలాంటి దాడులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించింది.

తదుపరి వ్యాసం