YCP Corporators: జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీకి గుడ్‌బై చెబుతున్న మాజీ ఎమ్మెల్యే !
YCP Corporators: విశాఖపట్నం వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు జనసేనలోకి చేరారు. వారిని పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు.
YCP Corporators: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, 77వ వార్డు కార్పొరేటర్ భట్టు సూర్యకుమారి, 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి భర్త శ్రీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొవగాపు సుశీల, ఉమామహేశ్వరరావు, శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ మాజీ ఛైర్మన్ జెర్రిపోతుల ప్రసాద్, లోక్ సత్తా జోనల్ మాజీ నాయకులు మంచిపల్లి సత్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయకులు పాపిరెడ్డి మహేశ్వరరెడ్డి తదితరులు మంగళవారం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. విశాఖ దక్షిణ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు.
“ఎన్నికల తరవాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి చేరికలు మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులంతా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు, వీర మహిళలతో మమేకమై ముందుకు వెళ్లాలని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలన్నారు.
విశాఖలో కాలుష్య సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేశంలోనే వాయు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా ఉందని కార్పొరేటర్లుగా మీ అందరిపై కాలుష్య నియంత్రణ బాధ్యత ఉందన్నారు. పర్యావరణశాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి తన పరిధిలోనే ఉందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలన్నారు.
విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని, విశాఖలో రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని, అన్నింటినీ పరిశీలించి ప్రజలకు న్యాయం చేద్దాం” అన్నారు.
నేడు వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాల ముఖ్యనేతలు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్ని కల్లో పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దొరబాబు 2014లో వైకాపా నుంచి పోటీచేసి ఓడారు. 2019లో పోటీచేసి గెలిచారు. 2024లో పెండెంను కాదని, పవన్ కళ్యాణ్‌పై వంగా గీతకు అవకాశం కల్పించారు.
వంగా గీత ఎన్నికల్లో పార్టీ కార్యాలయాన్ని పెండెం ఇంటికి దగ్గర్లోనే ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందే పార్టీని వీడాలని దొరబాబు నిర్ణ యించుకున్నా అప్పట్లో జగన్ ఆయన్ను బుజ్జగించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో దొరబాబు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, రాజీనామాపై బుధవారం ప్రకటన చేస్తానని వెల్లడించారు.