Balineni Srinivas: బాలినేనికి భంగపాటు…వెనుదిరిగిన మాజీ మంత్రి
12 April 2023, 13:38 IST
- Balineni Srinivas: వైసీపీలో కీలక నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు సిఎం పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. బాలినేని వాహనాన్ని పోలీసులు అడ్డుకుని, కాలి నడకన వెళ్లాలని ఆదేశించడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొనకుండానే తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు.
ప్రకాశం జిల్లా సిఎం పర్యటనలో మాజీ మంత్రి బాలినేని అవమానం
Balineni Srinivas: ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు కారులో వెళుతున్న మాజీ మంత్రిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కనపెట్టి నడిచి వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించారు. దీంతో పోలీసులపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనగా కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. బాలినేనికి సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, ఎస్పీ ప్రయత్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈబీసీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ వస్తుండటంతో స్వాగతం తెలిపేందుకు బాలినేని అనుచరులతో కలిసి వెళ్లారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఒంగోలు మేయర్‌తో కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోడానికి సిద్దమయ్యారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు జిల్లా ఎస్పీ సర్ది చెప్పడంతో బాలినేని చల్లబడ్డట్టు కనిపించినా ఆ తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించారు. బాలినేనితో పాటు ఆయన అనుచరులు కూడా సభా స్థలి నుంచి వెళ్లిపోయారు.
బాలినేని ఈబీసీ నేస్తం కార్యక్రమం నుంచి వెళ్లిపోయారని తెలియడంతో ముఖ‌్యమంత్రి కార్యాలయ అధికారులు ఆయనతో మాట్లాడారు. సమాచార లోపంతో ప్రోటోకాల్ జాబితాలో పేరు లేదని వివరించినట్లు తెలుస్తోంది. సభావేదిక వద్దకు రావాలని సిఎం సూచించడంతో బాలినేని తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత ఈబీసీ నేస్తం నిధుల విడుదలను బాలినేని చేతుల మీదుగా చేయించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులు విడుదల చేయించారు.
అసంతృప్తితోనే అలక….
గత ఏడాది మంత్రి విస్తరణలో బాలినేని పదవి కోల్పోయారు. సామాజిక సమీకరణల్లో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి సురేష్‌ను మాత్రమే పదవిలో కొనసాగించారు. ముఖ్యమంత్రికి బంధువైన బాలినేని మాత్రం పదవి కోల్పోయి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలకు పరిమితం అయ్యారు. మంత్రి హోదాకు తగ్గకుండా గౌరవ మర్యాదలు ఉంటాయని ముఖ్యమంత్రి సర్ది చెప్పాల్సి వచ్చింది. అప్పట్నుంచి బాలినేని లోలోపల రగిలిపోతున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని శాసించిన బాలినేనికి ప్రస్తుతం పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల్ని పార్టీలో కీలక స్థానాల నుంచి వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నారని ప్రచారం వైఎస్సార్సీపీలో ఉంది. పార్టీలో బలమైన వర్గం అంటూ ఏది ఉండకూడదనే ఉద్దేశంతోనే కీలకంగా వ్యవహరించిన నాయకులందరిని క్రమంగా పక్కకు తప్పించారనే ప్రచారం జరిగింది.
వైఎస్సార్సీపీ ఆవిర్భవించిన తొలి నాళ్లలో కీలకంగా వ్యవహరించిన సుబ్బారెడ్డి ఎప్పట్నుంచో ఎమ్మెల్సీ పదవి ఆశించినా ఆయనకు అది దక్కలేదు. టీటీడీ ఛైర్మన్ పదవితో సరిపుచ్చుకోవాల్సి వచ్చింద. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టినా సిఎం దానిని మన్నించలేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందనే భరోసా కూడా ఇవ్వలేదు. తాజాగా బాలినేని వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు కూడా వ్యూహాత్మకమేనని అనుచరులు అనుమానిస్తున్నారు.
పార్టీ ఆవిర్బావం నుంచి జిల్లాలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాల్లో బాలినేని కీలకంగా వ్యవహరించారు. ఇటీవలి కాలంలో పార్టీలో బాలినేని తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అనుచర వర్గం ఆరోపిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో బాలినేని మినహా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొ న్నారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాం కూడా వేదికపై సిఎంతో పాటు కనిపించారు.