తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam Water Release: కరువు తీరా కృష్ణాలో వరద ప్రవాహం, నేడు శ్రీశైలంలో నీటి విడుదల, కొనసాగుతున్న విద్యుతుత్పత్తి

Srisailam Water Release: కరువు తీరా కృష్ణాలో వరద ప్రవాహం, నేడు శ్రీశైలంలో నీటి విడుదల, కొనసాగుతున్న విద్యుతుత్పత్తి

Sarath chandra.B HT Telugu

29 July 2024, 10:54 IST

google News
    • Srisailam Water Release: అడుగంటి పోయిన జలాశయాల్లో వరద ప్రవాహం ఉరకలెత్తుతోంది.  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ  బిరబిర  ప్రవహిస్తోంది. నేటి సాయంత్రం శ్రీశైలం గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. 
సాయంత్రం తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు
సాయంత్రం తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు

సాయంత్రం తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు

Srisailam Water Release: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరుగులు తీస్తూ తెలుగు రాష్ట్రాల వైపు పయనిస్తోంది. నిన్న మొన్నటి వరకు రాళ్లు తేలి, అడుగంటి పోయిన జలాశయాల్లో వారం రోజుల్లోనే అనూహ్య మార్పు కనిపిస్తోంది. వరద ప్రవాహంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జల కళ సంతరించుకుంటోంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం నుంచి వరద నీటిని విడుదల చేయనున్నారు. 

రెండు రోజుల వ్యవధిలోనే 40టిఎంసిల నీరు శ్రీశైలం  చేరింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నీటిని విడుదల చేయాలని భావించినా ముందే ప్రాజెక్టు నిండిపోవడంతో సోమవారం సాయంత్రమే నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.  సోమవారం అర్థరాత్రికి  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకోనుంది. 

కృష్ణా బేసిన్‌లో‌ కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో, ఆలమట్టి, తుంగభద్ర, నారాయణపూర్ జలాశయాల్లో పూర్తి సామర్థ్యానికి చేరుతున్నాయి. వరద నీటి ప్రవాహం గరిష్ట మట్టానికి చేరడంతో దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలంలో కూడా క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 4,36,433 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 62,857 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 876.70 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 171.8625 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు.

నాగార్జున సాగర్‌లో…

నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 54438 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 6744క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు చేరింది. సాగర్‌ ప్రస్తుత నీటి మట్టం 511.40అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.5050 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 134.0598టీఎంసీలకు చేరింది.

కర్ణాటకలో కృష్ణా బేసిన్‌లో గత పది రోజుల్లో సుమారు 180 టీఎంసీల నీరు జలాశయాల్లోకి చేరింది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 4,41,222 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది.

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీరు విడుదల చేస్తారని ఏపీ ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి కల్వ కుర్తి ఎత్తిపోతల పథకానికి 1002 క్యూసెక్కులు, పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 5,958 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో మూడు రోజుల నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు.

గోదావరిలో కొనసాగుతున్న వరద…

గోదావరిలో కూడా వరద కొనసాగుతోంది. గత పక్షం రోజులుగా గోదావరి బేసిన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద కొనసాగుతోంది. పోలవరం ప్రాజక్టు వద్ద 12.58లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం స్పిల్‌ వే మీదుగా ప్రవహిస్తోంది. అటు భద్రాచagలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డలో వరద క్రమంగా తగ్గుతోంది. ఆదివారం 4.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు 85 గేట్లను ఎత్తి వరద నీటిని కిందకు పంపుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి 5.50 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.

తదుపరి వ్యాసం