Srisailam Project : మరింత పెరిగిన నీటిమట్టం - శ్రీశైలం గేట్లు ఎత్తేది ఎప్పుడు..? తాజా పరిస్థితి ఇదే
24 July 2024, 12:42 IST
- Krishna River Updates: కృష్ణా బేసిన్ లో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 845 అడుగులు దాటింది.
శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
Srisailam Project Water Levels : మహారాష్ట్ర, కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడూ తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. దీంతో జురాల, శ్రీశైలం ప్రాజెక్ట్ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. జురాల నుంచి 1,50,434 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం బుధవారం ఉదయం 9:18 గంటల సమయానికి 846.9 కు చేరింది. నీటినిల్వ 73.67టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు క్రమంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి ఔట్ ఫో లేదు.
శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్ నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. తాజా పరిస్థితి చూస్తే.. ఇప్పుడే గేట్లు ఎత్తే పరిస్థితి లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగాని శ్రీశైలం నిండే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే గేట్లు ఎత్తనున్నారు.
సాధారణంగా భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని టూరిస్టులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు.. భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇక నాగార్జున సాగర్ లో చూస్తే బుధవారం ఉదయం 10:21 గంటలకు చూస్తే…. 503.6గా నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 121.06 టీఎంసీల నీటి నిల్వ ఉండగా... ప్రస్తుతం ఇన్ ఫ్లో 7,023గా ఉంది. 8,896క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శాంతించిన గోదావరి...!
మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. దీంతో భయం గుప్పిట్లో కాలం గడిపిన ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయింది.
బుధవారం పూర్తిగా శాంతించిన స్థితిలో గోదావరి ప్రవాహం సాగుతోంది. ఉదయం 06:00 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 47.4అడుగులకు చేరుకున్నట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలియజేశారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. కాగా మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా నేటి సాయంత్రానికి గోదావరి నది ప్రవాహం సాదారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటుతుందని అధికారులు భావించిన నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నష్ట నివారణా చర్యల్లో అధికారులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు వరద ఉధృతి తగ్గింది. కిన్నెరసానికి కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుకుంది.