తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor Prices Display: ఎట్టకేలకు ఏపీలో మద్యం దుకాణాల్లో ధరల పట్టీలు, డిజిటల్ పేమెంట్లు, జూన్‌ 4 తర్వాత ఏం జరుగుతుందో…

Liquor Prices Display: ఎట్టకేలకు ఏపీలో మద్యం దుకాణాల్లో ధరల పట్టీలు, డిజిటల్ పేమెంట్లు, జూన్‌ 4 తర్వాత ఏం జరుగుతుందో…

Sarath chandra.B HT Telugu

31 May 2024, 5:30 IST

google News
    • Liquor Prices Display: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో ఎట్టకేలకు ధరల పట్టీలు ప్రత్యక్షమయ్యాయి. నాలుగున్నరేళ్లుగా ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా ఖాతరు చేయని ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో మద్యం దుకాణాల వద్ద ధరల బోర్డుల్ని ఏర్పాటు చేసింది.
ఏపీ మద్యం దుకాణాల్లో ధరల పట్టీలు, డిజిటల్ పేమెంట్లు
ఏపీ మద్యం దుకాణాల్లో ధరల పట్టీలు, డిజిటల్ పేమెంట్లు

ఏపీ మద్యం దుకాణాల్లో ధరల పట్టీలు, డిజిటల్ పేమెంట్లు

Liquor Prices Display: ఆంధ్రప్రదేశ్‌లో అత్యతం వివాదాస్పదమైన మద్యం విక్రయాల వ్యవహారంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్పులు వచ్చాయి. దాదాపు నాలుగున్నరేళ్లుగా విపక్షాలు, ప్రజలు ఎంత గగ్గోలు పెట్టినా రాని స్పందన ఎన్నికల కోడ్ నేపథ్యంలో వచ్చింది. మద్యం దుకాణాల్లో ఇటీవల ధరల పట్టీలను ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం అనుమతించిన మద్యం బ్రాండ్ల ధరలను బోర్డులుగా ఏర్పాటు చేశారు. ఏపీ బేవరేజీస్‌ డిపోల వారీగా అన్ని మద్యం దుకాణాల్లో వీటిని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ మెనూ ప్రకారమే సేల్స్...

ఏపీలో గత నాలుగేళ్లుగా మద్యం విక్రయాల్లో కూడా ప్రభుత్వ మెనూ మాత్రమే నడిచింది. పాఠశాలల్లో విద్యార్ధులకు మిడ్‌ డే మిల్స్‌, పౌష్టికాహారానికి మెనూ ఖరారు చేసినట్టు ఏ రోజు ఏ బ్రాండ్ మద్యాన్ని విక్రయించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని దాదాపు రెండు రెట్లు పెంచేశారు. అక్రమ చొరబాట్లను కట్టడి చేయడంతో పాటు, నాటుసారా తయారీ, అక్రమ రవాణా కట్టడి కోసం ఏకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటు చేసి హడావుడి చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి రాకుండా చూడ్డానికి నానా తంటాలు పడ్డారు.

ఐదేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం, మద్యం కొనాలంటే కరెంట్ షాక్ కొట్టేలా చేస్తామనే ప్రకటనలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత ఆచరణలో సాధ్యం కాదని త్వరగానే గ్రహించారు. 2019 నాటికి ఏపీలో మద్యం విక్రయాల మీద వచ్చే ఆదాయం 18వేల కోట్లు ఉంటే 2024 నాటికి అది 30వేల కోట్ల చేరువైంది. ఏపీలో మద్యాన్ని మించి ప్రభుత్వానికి మరో ఆదాయ మార్గం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలకు మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

భారీగా ధరలు పెంచేసి…

అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని అమాంతం పెంచేశారు. దీంతో తెలంగాణ, కర్ణాటక, గోవా,హర్యానాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించింది. నాటుసారా వినియోగం గణనీయంగా పెరిగింది. అక్రమ రవాణాను నియంత్రించలేమని గుర్తించడంతో ధరల్ని దశల వారీగా తగ్గించారు. మరోవైపు ఏపీలో మద్యం విక్రయాలతో కళ్లు చెదిరే ఆదాయం వస్తుండటంతో పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఏపీతో సమానంగా ధరలు పెంచేశాయి. దీంతో అక్రమ రవాణాకు కాస్త అడ్డుకట్ట పడింది.

ధరల విషయంలో కాస్త నియంత్రణ వచ్చినా ఏపీలో విక్రయించే మద్యం బ్రాండ్ల మీద మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. నాణ్యతా లోపం, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రుచిలో తేడా, బాట్లింగ్ చేసిన వెంటనే నేరుగా విక్రయాలకు పంపడం వంటి సమస్యలు ఉన్నాయి. ఏ రోజు ఏ దుకాణంలో ఏ బ్రాండ్ మద్యాన్ని విక్రయించాలనే దానిని కూడా పకడ్బందీగా అమలు చేశారు. దీంతో 2019కు ముందు వినియోగంలో ఉన్న చాలా బ్రాండ్లు అందుబాటులో లేకుండా పోయాయి. చీప్‌ లిక్కర్ మొదలుకుని, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వరకు ప్రభుత్వం నిర్ణయించిన బ్రాండ్లను మాత్రమే తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రుచి చూడని రకాలు, పేర్లు తెలియని బ్రాండ్లు ఏపీలో మాత్రమే ఐదేళ్లలో అమ్ముడయ్యాయి. మద్యం విక్రయాలను కేవలం నగదు లావాదేవీలకు మాత్రమే పరిమితం చేశారు.

మద్యం విక్రయాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లిక్కర్ డబ్బులు పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదు చేయడంతో ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆ వెంటనే మద్యం దుకాణాల వద్ద ధరల పట్టీలు ప్రత్యక్షం అయ్యాయి. కొద్ది రోజులుగా మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే అసలు ధరతో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జీలను కూడా కొనే వారి నుంచి ఒక్కో బాటిల్‌పై రెండు రుపాయల వరకు వసూలు చేస్తున్నారు.

ఏపీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం ధరల్ని నియంత్రించడంతో పాటు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో తెస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దుకాణాల ముందు బ్రాండ్లు, ధరల పట్టీలు రావడంతో జూన్ 4 తర్వాత ఏమి జరుగుతుందనే ఆసక్తి మందుబాబుల్లో నెలకొంది.

తదుపరి వ్యాసం