తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravathi Housing Issue: ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరిన అమరావతి రైతులు

Amaravathi Housing Issue: ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరిన అమరావతి రైతులు

HT Telugu Desk HT Telugu

31 July 2023, 11:47 IST

google News
    • Amaravathi Housing Issue: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించి, వాటిలో జులై 24న నిర్మాణాలు ప్రారంభించడంపై స్టే ఇవ్వాలని  రైతులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. 
ఏపీ హైకోర్టు విచారణ
ఏపీ హైకోర్టు విచారణ

ఏపీ హైకోర్టు విచారణ

Amaravathi Housing Issue: అమరావతి ప్రాంతంలో స్థానికేతరులు ఇంటి స్థలాలను కేటాయించి, నిర్మాణాలు చేపట్టడంపై స్టే విధించాలని కోరుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24న తలపెట్టిన భూమిపూజపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తితో వివరణ ఇవ్వ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ ద్వారా అమరావతి రాజధాని కోసం సమీకరించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు సంక్రమించలేదని రైతుల తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టులో వాదించారు.

రైతులతో సీఆర్డీయే చేసుకున్న ఒప్పందంప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ను ఆధారంగా సేకరించిన భూముల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసిన తరువాతే ప్రభుత్వానికి హక్కులు సంక్రమిస్తాయని వివరించారు. రాజధాని కోసం సమీకరించిన భూములపై థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించ వద్దని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు.

ఇళ్ల స్థలాలకు లేఅవుట్‌ అనుమతి ఇచ్చే అధికారం సీఆర్డీయే కమిషనర్‌కు లేకపోయినా హడావుడిగా అనుమతులు ఇచ్చేశారని ఆరోపించారు. రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనుమతిస్తూనే, అవి హైకోర్టు ఇచ్చే తుదితీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు.

ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లపట్టాలపై ఈ విషయాన్ని ముద్రించాలని అధికారులకు చెప్పిందని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎటువంటి హక్కులూ కోరబోమన్న నిబంధనతోనే లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని తెలిపిందన్నారు. హైకోర్టులో ఈ వ్యవహారం తేలక ముందే హడావుడిగా ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇళ్ల స్థలాల కేటాయింపుపై తీర్పు వ్యతిరేకంగా వస్తే వందల కోట్ల ప్రజా ధనం వృధా అవుతుందని చెప్పారు.

రాజధాని అభివృద్ధి చెందే కొద్ది ఈ ప్రాంతంలో నివసించే ప్రజలతో పాటు, వలసవచ్చే పేదల ఇళ్ల నిర్మాణం కోసం భూమిని వినియోగించాల్సి ఉంటుందని, రాజధాని అభివృద్ధిని పక్కనపెట్టి బయట ప్రాంతాలవారికి ఇళ్లస్థలాలు ఇస్తున్నారని కోర్టులో వివరించారు.

లబ్ధిదారులకు వారి గ్రామం, పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అవసరమైన భూమి అక్కడ అందుబాటులో లేకుంటే గ్రామ, పట్టణ సమీపంలో మరోప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వొచ్చని ఏపీ ప్రభుత్వం బీఎస్‌వో నిబంధనలను పాటించ లేదని పేర్కొన్నారు.

అమరావతిలో ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 24న శంకుస్థాపన చేయబోతున్నారని ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై దాఖలైన మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

సీఆర్డీయే చట్టం నిబంధనలకు విరుద్ధంగా, ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమిని జిల్లా కలెక్టర్లకు బదిలీ చేశారని, భూమి స్వాధీనానికి ముందే సీఆర్డీయేకు ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సి ఉందన్నారు. సొమ్ము చెల్లింపులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, అన్ని వ్యాజ్యాల్లో కౌంటర్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయేలను ఆదేశించింది.

ఇళ్ల నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.

తదుపరి వ్యాసం