BalaTripura Sundari: బాలత్రిపురసుందరిగా దుర్గమ్మ..ఇంద్రకీలాద్రిపై వైభవంగా మొదలైన దసరా వేడుకలు
03 October 2024, 4:00 IST
- BalaTripura Sundari: శరన్నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత బాలా త్రిపుర సుందరీదేవిగా సాక్షాత్కరిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు.
బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ
BalaTripura Sundari: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రుల్లో తొలిరోజు కనకదుర్గ అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. దసరా ఉత్సవాలను ప్రారంభించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి సాధారణ భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.
"అరుణ కిరణ జాలై రంచితాశావకాశా
విధృత జపపటీకా పుస్తకాభీతిహస్తా
ఇతరవరకారాధ్యా ఫుల్లకల్హారసంస్థా
నివసతు హృదిబాలా నిత్యకళ్యాణశీలా"
అంటూ దేవీ శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదిగా, శ్రీ బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లో గొప్పది, ముఖ్యమైనదని అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్ట మొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారని చెబుతారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. దసరా ఉత్సవాల్లో భక్తులకు సంపూర్ణ ఫలం అందించే అలంకారం బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారమని పండితులు చెబుతారు.
బాలాదేవీ అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలరని చెబుతారు. అమ్మవారి ఆలయంలో ఉత్సవాల్లో రెండో రోజు ఈ అలంకరణ చేయడానికి కారణం శ్రీ విద్యాశంకరాచార్యుల వారిచే అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర యంత్రం ప్రతిష్టించబడి ఉంది.
అర్చనలు చేసే వారితో పాటు చేయించుకునే వారికి కూడా బాలాదేవి అనుగ్రహం ఉండాలని అందుకే బాలాదేవిని ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజ దంపతులకు ఇంద్రకీలాద్రిపై శ్రీబాలా త్రిపుర సుందరీదేవి రూపంతో దర్శనమిచ్చిన అమ్మవారు సత్సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలో వివరిస్తారు.
ఇంద్రకీలాద్రి వైభవం…
ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించడానికి చారిత్రక నేపథ్యముంది. ఇంద్రకీలాద్రి పర్వత విశిష్టత గురించి స్కాంద పురాణం సహ్యద్రి ఖండంలో ఇలా వివరిస్తారు.
"సకీలాద్రి స్వర్ణమయం సర్వదేవతాయస్తదా
నృసింహవాసపర్యంతం స్థితోదీర్ఘేణవర్తతే"
అనిఇంద్రకీలాద్రి ప్రస్తావన ఉంటుంది. కృష్ణానదికి ఉత్తర తీరాన సర్వదేవలు కొలువున్న స్వర్ణ మయమైన కీల పర్వతం, అత్యంత విశాలంగా కృష్ణానది దక్షిణ భాగంలో నృసింహవాసం అయిన మంగళాచలం వరకు విస్తరించి ఉండేది. ఈ పర్వతానికి ఈ పేరు రావడానికి ఇంకో ఇతిహాసం ఉంది. పూర్వం కీలుడు అనే యక్షుడు ఆదిపరాశక్తి అయినా దుర్గాదేవిని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు “ఏమి కావాలో కోరుకోమన్నారు” ఆ మాట విని యక్షుడు పరమ సంతోషంతో జగన్మాతని అనేక విధాలుగా స్తుతించి తల్లీ నీవు ఎల్లప్పుడూ నా హృదయంలో నివసించాలి" కోరుకున్నాడు.
కీలుడికిచ్చిన మాట ప్రకారం…
యక్షుడి కోరికను మన్నించిన అమ్మవారు "పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పర్వత రూపాన్ని ధరించి ఉండాలని, కృత యుగంలో అసుర సంహారానంతరం తాను ఆ పర్వతంపై కొలువై ఉంటానని వరమిచ్చినట్లు పురాణాలు చెబుతాయి. వెంటనే కీలుడు పర్వత రూపాన్ని ధరించి దేవి ఆవిర్భావం కోసం ఎదురు చూశాడు.
కృతయుగంలో మహిషాసురుడిని సంహరించిన తర్వాత దుర్గాదేవి కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం మహిషాసురమర్దిని స్వరూపంతో కీలాద్రిపై అవతరించారు. స్వర్ణమణిమయ కాంతులతో కోటి సూర్య సమప్రభలతో బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్న మహిషాసురమర్దిని కొలువున్న కీలాద్రి పర్వతం మీదకు ఇంద్రాది దేవతలంతా వచ్చి నిత్యం పూజలు చేయడంతో కీలపర్వతానికి ఇంద్రకీలాద్రి పర్వతంగా పేరువచ్చింది.
కనకాచల పర్వతం….
కీలుడు ఉపాసించిన దుర్గాదేవి కనకవర్ణంతో మహిషాసురమర్దినిగా అవతరించడం వల్ల ఇంద్రకీలాద్రి పర్వతానికి కనకాచలం అనే పేరు కూడా ఉంది. మహిమాన్వితమైన ఇంద్రకీలాద్రి మీద ద్వాపరయుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడి గురించి ఘోర తప్పస్సు చేసి ఆయన్ని మెప్పించి పాశుపతాస్త్రం సాధించాడని పౌరాణిక గాథ ఉంది.
ఇంద్రకీలాద్రిపై సర్వం సిద్ధం…
ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని, ఈ నేపథ్యంలో నగరానికి విచ్చేసే భక్తులు, యాత్రికుల భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలని నగర పోలీస్ కవిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అధికారులు, సిబ్బందికి సూచించారు.
దసరా బందోబస్తు సందర్భంగా వివిధ జిల్లాల నుండి విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది, అధికారులకు బుధవారం మాచవరం పోలీస్ స్టేషన్ పరిదిలోని లయోలా ఆడిటోరియం గ్రౌండ్స్ నందు నిర్వహించిన సమావేశంలో సీపీ రాజశేఖరబాబు పాల్గొని బందోబస్త్ విధులపై మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను అందించి దిశానిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, విజయవాడ నగరంలో జరిగే దసరా వేడుకలకు ప్రత్యేక విశిష్టత, ప్రాధాన్యతలు ఉన్నాయని, ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు నగరానికి విచ్చేసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో రోటీన్ బందోబస్త్ లాగా కాకుండా కొంత మనసు పెట్టి శ్రద్ధతో బందోబస్తు విధులు నిర్వహిస్తే భక్తుల మన్ననలతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. యూనిఫాంలో విధులు నిర్వహించే సమయంలో ఇతరులు మనల్ని గమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలని, బందోబస్తు నిర్వహించే సందర్భంలో పాటించాల్సిన మార్గ దర్శకాలు, విధి నిర్వహణలో వ్యవహరించే తీరును ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది తెలుసుకోవాలన్నారు.
మూడు షిఫ్టుల్లో బందోబస్తు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కాబట్టి మరింత సమర్ధవంతంగా బందోబస్తు విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది ఇతర శాఖల సిబ్బందితో, వి.ఐ.పి.లతో గానీ వివాదాలకు తావులేకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. ఇటువంటి బందోబస్తుల్లో సమన్వయంతో వ్యవహరిస్తే అమ్మవారి దర్శనం సజావుగా సాగుతుందన్నారు.
అలాగే దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకు మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కూడా వారితో మర్యాదగా వ్యవహరిస్తూ సక్రమంగా అమ్మవారి దర్శనం అయ్యేలా చూడాలని, అదే సమయంలో క్యూలైన్లలో ఏవిధమైన సంఘటనలకు ఆస్కారం లేకుండా క్యూలైన్లలో భక్తులు సక్రమంగా కదిలేలా కృషి చేయాలన్నారు.