Student Kits Distribution: ఏపీలో యథావిధిగా స్టూడెంట్ కిట్స్ పంపిణీ, కిట్లపై ఫోటోలు, పేర్లు లేవని విద్యాశాఖ సష్టీకరణ
14 June 2024, 9:07 IST
- Student Kits Distribution: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు పంపిణీ చేస్తోన్న స్టూడెంట్ కిట్స్ పంపిణీ యథావిధిగా జరుగనుంది. ఈ ఏడాది తయారైన కిట్లపై ఎలాంటి ఫోటోలు, పేర్లు, ప్రకటనలు లేవని విద్యా శాఖ స్పష్టం చేసింది.
ప్రకటనలు లేకుండా రూపొందిన స్టూడెంట్ కిట్లు
Student Kits Distribution: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు పంపిణీ చేసే కిట్లను విద్యార్థులకు యథావిధిగా అందచేయనున్నారు. గత ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరుతో పంపిణీ చేస్తున్న కిట్లను ఈ ఏడాది కూడా విద్యార్ధులు అందచేయనున్నారు. ఈ ఏడాది విద్యా కానుక కిట్ల తయారీ సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కిట్ల తయారీ, టెండర్ల వ్యవహారంపై టీడీపీ పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగించే విషయంలో ఈసీ స్పష్టమైన మార్గదర‌్శకాలు జారీ చేసింది.
దీంతో విద్యాశాఖ అధికారులు కిట్ల తయారీకి ఆర్డర్లు ఇచ్చే సమయంలోనే జాగ్రత్త తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్షలో పాఠశాలలు పున: ప్రారంభమైనందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టూడెంట్ కిట్‌లను పంపిణీ చేయమని ఆదేశించారు.
కొద్ది రోజుల తర్వాత కిట్ల నాణ్యత పరిశీలన చేయిస్తానని విద్యాశాఖ అధికారులకు సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కిట్లలో నాణ్యతా లోపాలు గుర్తిస్తే తదుపరి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులకు స్పష్టం చేశారు.
స్టూడెంట్ కిట్లలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పంపిణీ చేస్తున్న, కిట్ లోని వస్తువుల మీద ఎలాంటి ఫొటోలు, పథకానికి సంబంధించిన రాజకీయ చిహ్నం (లోగో), ఎవరి పేర్లు ముద్రించకూడదని 2024 మార్చి 19వ తేదీన కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. ఈసీ మార్గదర‌్శకాలకు అనుగుణంగా కొత్త కిట్ల విషయంలో నిబంధనలను అమలు చేశారు. కాంట్రాక్టర్లకు ఆ సమాచారం రాతపూర్వకంగా ఇచ్చినట్టు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు స్టూడెంట్ కిట్ వస్తువులను మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ‘స్టూడెంట్ కిట్’ లో ఉన్న వస్తువులపై రాజకీయ పేర్లు, చిత్రాలు, లోగోలు ముద్రించకుండా సరఫరా చేస్తున్నట్టు ప్రకటించారు.
అవి పాత స్టాకులు…
గత విద్యా సంవత్సరాల్లో మిగిలి పోయిన స్టాకు చూపించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొత్త కిట్లపై ఎలాంటి ప్రకటనలు లేవని స్పష్టం చేవారు. పాఠశాలలు తెరవడానికి ముందే జూన్ 11న నిర్వహించిన సమావేశంలో పాతకిట్లను విద్యార‌్థులకు పంపిణీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పాతకిట్లను విద్యార్ధులకు పంపిణీ చేస్తే మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు ఉంటాయని ఎస్‌ఎస్ పీడీ ప్రకటించారు.