Digital Campaign: డిజిటల్ ప్రచారం వికటిస్తోందా…వైసీపీ నేతల్లో అంతర్మథనం
23 March 2023, 13:19 IST
Digital Campaign: మీడియా కంటే సోషల్ మీడియా కాంపెయిన్‌తో ఎక్కువ ప్రయోజనం ఉంటుందనుకుంటే అసలుకే ఎసరొచ్చిందని వైసీపీ నేతలు లబోదిబోమంటున్నారు.అధికారంలోకి వచ్చినప్పట్నుంచి డిజిటల్ ప్రచారాలపై పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన ఆ పార్టీకి ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, ప్రచారం లేకపోవడమేనని గుర్తించారు.
డిజిటల్ ప్రచారంలో వైసీపీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు
Digital Campaign: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి సొంత మీడియా ఉండటంతో ప్రచారంతో పనేముందన్నట్లు ఇన్నాళ్లు వ్యవహరించింది. దీనికి తోడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులతో మీడియా మొత్తం తమ పార్టీకి వ్యతిరేకమనే భావన ఆ పార్టీ పెద్దల్లో మొదటి నుంచి ఉంది. మీడియా అండదండలు లేకపోయినా సొంతంగా అధికారంలోకి రావడానికి కార్యకర్తలు, అభిమానులు పుష్కలంగా ఉండటమే కారణమని భావించారు. దీంతో మీడియాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం దూరం పెడుతూ వచ్చింది.
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాటితో తప్ప మిగిలిన సంస్థలతో ఏపీ ప్రభుత్వ పెద్దలు మొదటి నుంచి అంటి ముట్టనట్టే వ్యవహరించారు. దీంతో నాలుగేళ్లలో కావాల్సినంత నష్టం జరిగిపోయింది. ప్రభుత్వానికి మీడియా సంస్థలు వ్యతిరేకంగా ఉన్నాయని పదేపదే చెప్పడం ద్వారా నష్టనివారణ చేస్తున్నామని భావించారే తప్ప ప్రతి వ్యూహాలను మాత్రం సిద్దం చేసుకోలేకపోయారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకులు గతంలో చేసిన పొరపాట్లను బేరీజు వేసుకుని జరిగిన లోపాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే తాము కూడా వ్యవహరించామని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
ట్రెండింగ్‌లతో సరి…
ఏపీలో ప్రభుత్వ ప్రచారం అంటే ఆ పూటకు ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడమే పెద్ద యజ్ఞంలా భావిస్తున్నారు. ట్విట్టర్ వినియోగించే జనం ఎంతమంది, ట్విట్టర్ వినియోగదారుల్లో ఓటర్లు ఎందరు, సోషల్ మీడియా ప్రచారాలతో సామాన్యులు ఎంత వరకు ప్రభావితం అవుతారు అనే సంగతి పట్టించుకోకుండా ట్రెండ్ లు చేయడం, జబ్బలు చరుచుకోవడం అధికార పక్షానికి అలవాటై పోయింది. ఈ సోషల్ మీడియా ట్రెండ్‌లు, వాటి ప్రభావం ఎంతనేది మాత్రం ఎవరికి తెలీదు.
ప్రస్తుతం వైసీపీకి ఒకటికి నాలుగైదు సోషల్ మీడియా విభాగాలున్నాయి. పార్టీ సోషల్ మీడియా విభాగంతో పాటు డిజిటల్ కార్పొరేషన్, ఐ ప్యాక్ కాంపెయిన్ వింగ్, పార్టీ ఐటీ వింగ్‌తో పాటు ప్రభుత్వానికి చెందిన ఐ అండ్ పిఆర్ కూడా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తోంది. వీటి మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.
కోట్లు ఖర్చు పెట్టిన గతంలో ఎందుకు ఫలితాన్నివ్వడం లేదనే ప్రశ్న అందరిలోను ఉంది. పార్టీ కోసం స్వచ్ఛంధంగా పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూే ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన సమయంలో కార్యకర్తలు బహిరంగంగానే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పలువురు సోషల్ మీడియా ఖాతాల్లో విమర్శలకు దిగారు. అదే సమయంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ప్రతి పక్ష పార్టీలకు, అధికార పార్టీలకు మధ్య గణనీయంగా వ్యత్యాసం కనిపిస్తోంది. టీడీపీ సొంతంగా వీడియో కంటెంట్ తయారు చేయించి ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల్లో విడుదల చేస్తోంది. ప్రభుత్వ విధానాలపై వ్యంగ్యంతో కూడిన కంటెంట్ తయారు చేసి విడుదల చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఖాతాల్లో రోజు వారీ ప్రభుత్వ కార్యకలాపాలను ప్రచారం చేయడానికి పరిమితం అవుతున్నాయి. కనీసం ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టలేకపోయాయని గతంలో అధికార పార్టీ తరపున ఉత్సాహంగా పని చేసిన నాయకుడు తెలిపారు. పార్టీ నుంచి ప్రోత్సాహం, గుర్తింపు లేకపోవడం, చాలామంది కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి రావడంతో గతంలో ఉన్నంత ఉత్సాహంగా పనిచేయట్లేదని గుర్తు చేశారు.
టాపిక్