తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp To Tdp, Janasena: అక్కడ చెల్లని కాసులు ఇక్కడ చెల్లుతాయా? వారి మీద జనంలో వ్యతిరేకత మాటేమిటి?

YSRCP to TDP, Janasena: అక్కడ చెల్లని కాసులు ఇక్కడ చెల్లుతాయా? వారి మీద జనంలో వ్యతిరేకత మాటేమిటి?

23 September 2024, 12:20 IST

google News
    • YSRCP to TDP, Janasena: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు పాత పరిచయాలతో తమ దారి తాము చూసుకుంటుంటే కార్పొరేషన్లలో నాయకులు అధికారంలో ఉన్నన్నాళ్లు పనులు చక్క బెట్టుకోడానికి గోడ దూకేస్తున్నారు.
వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్న కార్పోరేటర్లతో ఆ పార్టీలకు లాభమెంత?
వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్న కార్పోరేటర్లతో ఆ పార్టీలకు లాభమెంత?

వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్న కార్పోరేటర్లతో ఆ పార్టీలకు లాభమెంత?

YSRCP to TDP, Janasena: ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని అంటిబెట్టుకోవాల్సిన అవసరం లేదని భావిస్తోన్న నేతలు పక్క పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార పీఠాన్ని దక్కించుకోడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

2021లో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఎన్నికల నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా అప్పట్లో అధికార పార్టీ వాటిని ఖాతరు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేసింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. పార్టీ ఓడిన తర్వాత అదే పార్టీలో కొన సాగడం అనవసరం అనుకుంటున్న నేతలు తమ దారి తాము చూసు కుంటున్నారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌లో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు.

తాజాగా గుంటూరు, విజయవాడలో కార్పొరేటర్లు పలువురు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. విజయవాడలోఇప్పటికే 8మంది కార్పొరేటర్లు వైసీపీని వీడారు. మరో 14మంది ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారు. 2021 మార్చిలో ఎన్నికైన కార్పొరేటర్లు 2026 మార్చి వరకు పదవీ కాలం ఉంది.

ఆ పార్టీలకు లాభమా నష్టమా...

వైసీపీ కార్పొరేటర్లను ఎన్డీఏ కూటమి పార్టీల్లో చేర్చుకోవడం వల్ల లాభమా నష్టమా అనే చర్చ కూడా జరుగుతోంది. విజయవాడ వంటి నగరంలో కార్పొరేటర్ల వ్యవహార శైలితోనే ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన కార్పొరేటర్లు వైసీపీ తరపున గెలిచారు. అధికారంలో ఉంటూ పనులు చక్కబెట్టుకున్నారు. వార్డు సచివాలయాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రతి పనికి వసూళ్లకు పాల్పడ్డారు.

ఇళ్ళ ముందు నిర్మాణ సామాగ్రి కనిపిస్తే సచివాలయ సిబ్బందిని ఇళ్లపైకి పంపి కార్పొరేటర్లతో సెటిల్‌ చేసుకోవాలని ఒత్తిడికి గురి చేసేవారు. ప్రతిపనికి రేటు కట్టి ఎడాపెడా వసూళ్లతో వైసీపీని పూర్తిగా భ్రష్టు పట్టించడంలో కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించారు. పేరుకు మేయర్‌ ఉన్నా పెత్తనం మొత్తం మేయర్ భర్త చేతిలో ఉండేది.

విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న 56 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంలో అక్కడి స్థానిక నాయకుల వ్యవహార శైలి కీలకంగా పనిచేసింది. ద్వితియ శ్రేణి నాయకుల దందాలను ఎమ్మెల్యేలు చూసి చూడనట్టు వదిలేయడం, కొన్ని చోట్ల వారి వెనుక ఉండి నడిపించడంతో ఆ పార్టీ నిలువున మునగాల్సి వచ్చింది.

కార్పొరేటర్ల మంచితనం ఎవరి ఖాతాలోకి....

ప్రస్తుతం వైసీపీని ఖాళీ చేసే పనిలో భాగంగా ఆ పార్టీ ద్వితియ శ్రేణి నాయకులు ఎన్డీఏ కూటమి పార్టీల్లో చేరుతున్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉన్న కార్పొరేటర్లలో ఇద్దరు బీజేపీ, ఇద్దరు టీడీపీలో చేరారు. మరో నలుగురు త్వరలో జనసేనలో చేరనున్నారు. 64మంది సభ్యుల కార్పొరేషన్‌లో మేయర్‌ పదవి దక్కాలంటే 33మంది సభ్యుల బలం ఉండాలి.నగరంలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కలిపి 14మంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

2021లో వైసీపీ తరపున 49మంది, టీడీపీలో 14, సిపిఎం తరపున ఒకరు గెలిచారు. ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత తన పదవికి రాజీనామా చేయడంతో 13మంది టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కొత్తగా చేరిన వారితో కలిపి 15మంది టీడీపీలో ఉన్నారు. జనసేన, బీజేపీలతో కలిపితే 21కు కూటమి బలం పెరుగుతుంది. మరో 12మందిని తమ వైపు తిప్పుకుంటే మేయర్ పీఠం ఎన్డీఏ వశం అవుతుంది.

మరోవైపు కార్పొరేటర్లను చేర్చుకోవడంపై ఇన్నాళ్లు జనసేన, టీడీపీల్లో పనిచేసిన నాయకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అధికారం కోసమే పార్టీలు మారే వారితో తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. తాత్కలికంగా కూటమిపార్టీలకు  మేలు జరిగినా దీర్ఘ కాలంలో  అవినీతి మకిలి కార్పొరేటర్లతో జనంలో వ్యతిరేకత తప్పదని చెబుతున్నారు. 

తదుపరి వ్యాసం