తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్యం బాగుంది... దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు - జైళ్ల శాఖ డీఐజీ

Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్యం బాగుంది... దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు - జైళ్ల శాఖ డీఐజీ

13 October 2023, 20:32 IST

google News
    • Chandrababu Health Condition : రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్య, భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలను వివరించారు.
జైళ్ల శాఖ డీఐజీ
జైళ్ల శాఖ డీఐజీ

జైళ్ల శాఖ డీఐజీ

Chandrababu Health Condition : చంద్రబాబు నాయుడుకు సంబంధించి భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారని డీఐజీ రవికిరణ్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన…. మొదటి నుంచి హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు చంద్రబాబుకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. 24/7 చంద్రబాబు నాయుడుకు ఒక హెడ్ వార్డర్, ఆరుగురు వార్డర్లతో స్నేహ బరాక్ వద్ద భద్రత ఏర్పాటు చేశామన్నారు. వీరంతా నిరంతరం అందుబాటులో ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడుకు వచ్చే ఆహారం, ఇతర అంశాలను తనిఖీ చేసి అందించేందుకు ఒక జైలర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించామన్నారు. బయట నుంచి వచ్చిన భోజనాన్ని పరీక్షించి మరీ లోపలికి పంపుతున్నామని స్పష్టం చేశారు. ఎస్పీ సలహా, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు డీఐజీ రవి కిరణ్. జైలులో ఉన్న వైద్యాధికారులు రోజుకు మూడుసార్లు ఆయనకు వైద్యపరీక్షలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా, ప్రస్తుతం 67 కేజీల బరువుకు చేరుకున్నారని వివరించారు. చంద్రబాబు బరువు తగ్గారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు. కొంత డీహైడ్రేషన్ కు గురై చర్మ సంబంధిత సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే వెంటనే డెర్మటాలజిస్టులను రప్పించి చికిత్స అందించామన్నారు. తాగునీరు, భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్ కు, పేషెంట్ కు మధ్య ఉండే ప్రైవసీ అన్నారు. చంద్రబాబు నాయుడు రోజూ వినియోగిస్తున్న మందులనే వాడుతున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై దుష్ప్రచారం తగదన్నారు. జైల్లో 2000 మంది ఖైదీలు ఉంటారన్నారు. వారిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై బాధ్యత తమపైనే ఉందన్నారు. వాటర్ పొల్యూషన్ కారణమైతే అందరికీ రావాలి కదా? అని ప్రశ్నించారు. స్టెరాయిడ్స్ అంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. హెల్త్ బులెటిన్స్ రోజూ విడుదల చేస్తామన్నారు.

చంద్రబాబుకు నిబంధనల ప్రకారం ఏసీ, కూలర్స్ ఇవ్వలేమన్నారు. ఏసీ వసతి జైళ్ల మ్యాన్యువల్ లో లేదని తెలిపారు. దోమ తెర ఇచ్చామన్నారు. కోర్టు నుంచి ఏం ఆర్డర్స్ వస్తే వాటి ప్రకారం నడుచుకుంటామన్నారు. చంద్రబాబు రూమ్ లో 8 ఫ్యాన్స్ పెట్టామన్నారు. నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని వెల్లడించారు. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబుకు భద్రతా లోపాలు ఉన్నాయన్న వార్తలు నమ్మొద్దన్నారు. చంద్రబాబు దగ్గరకు వేరే ఏ ఖైదీని అనుమతించడం లేదని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రతీ మూమెంట్ సీసీటీవీలో రికార్డవుతుందన్నారు. చంద్రబాబును ఉంచిన బ్యారెక్ చాలా విశాలంగా ఉందని తెలిపారు. జైలులోకి డ్రోన్ వచ్చిందన్న వార్త పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఊహించని రీతిలో తప్పుడు వార్తలు రావడంతో స్పష్టతనిస్తున్నామన్నారు. ఇకపై ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తదుపరి వ్యాసం