Pawan Kalyan: పంచాయితీ నిధులు మళ్ళించేశారు.. అవకతవకలు సరిచేస్తామన్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
26 July 2024, 11:51 IST
- Pawan Kalyan: గ్రామపంచాయితీలకు 14,15ఆర‌్థిక సంఘాల ద్వారా మంజూరైన నిధులపై ఏపీ అసెంబ్లీలో పంచాయితీ రాజ్ శాఖ అధికారుల సమాధానాలపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయితీలకు నిధులు ఇచ్చేశామని చెప్పడాన్ని తప్పు పట్టారు.
పంచాయితీ నిధుల మళ్లింపుపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan: గ్రామ పంచాయితీలకు 14,15వ ఆర్థిక సంఘాల ద్వారా వచ్చిన నిధులను పంచాయితీలకు చెల్లించినట్టు అసెంబ్లీలో ప్రకటించడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అనుమతి లేకుండా నిధులు మళ్లించేసినా పంచాయితీలకు నిధులు ఇచ్చామని చెప్పడాన్ని సభ్యులు తప్పు పట్టారు.
పంచాయితీరాజ్ శాఖపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. 14,15వ ఆర్థిక సంఘాల ద్వారా 2019-20 నుంచి 23-24 వరకు గ్రామ పంచాయితీలకు సంవత్సరం వారీగా వచ్చిన నిధులను వివరించారు.
కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామపంచాయితీల కోసం 2019-20లో 2336.86కోట్లు విడుదల చేస్తే వాటిలో ఏపీ ప్రభుత్వం ద్వారా పంచాయితీలకు రూ. 2336.56 కోట్లు పంచాయితీలకు విడుదలయ్యాయని చెప్పారు.
2020-21లో మొదలైన 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.1837.80కోట్లు విడుదలైతే గ్రామపంచాయితీలకు రూ .1837.50కోట్లు విడుదల చేశారని, 2021-22లో రూ.1338.52కోట్లు విడుదలైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1338.52కోట్లు పంచాయితీలకు చెల్లించినట్టు చెప్పారు. 2022-23లో రూ. 1378.65కోట్లను ఇస్తే, ఏపీప్రభుత్వం పంచాయితీలకు రూ.1378.65 కోట్లు చెల్లించిందని, 2023-24లో 1392.62కోట్లు విడుదలైతే ఏపీ ప్రభుత్వం పంచాయితీలకు 696.41కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.
15వ ఆర్థిక సంఘం 5,947.36కోట్లు విడుదల చేస్తే ఏపీ ప్రభుత్వం వాటిలో పంచాయితీలకు రూ. 5251.08 కోట్లు విడుదల చేసిందని.. 14,15 ఆర్థిక సంఘాల ద్వారా మొత్తం 8283.92కోట్లు విడుదలచేస్తే ఏపీ ప్రభుత్వం 7587.64కోట్లను పంచాయితీలకు విడుదల చేసినట్టు పవన్ సభలో ప్రకటించారు. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఇంకా 696.28కోట్లను ఏపీ ప్రభుత్వం పంచాయితీలకు చెల్లించాల్సి ఉందన్నారు.
నిధుల కొరతతో సమస్యలు…
పంచాయితీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడం, గ్రామాల్లోని 21వేల మంది పారిశుధ్య కార్మికులు విధులకు దూరం అయ్యారని పవన్ చెప్పారు. ఇంకా 23వేల మంది కార్మికులకు 103కోట్లు చెల్లించాల్సి ఉందని, తగినంత సిబ్బందిలేక గ్రామాల్లో పారిశుధ్యం క్షీణిస్తోందని, తాగునీరు అందడం లేదని, నీటి సరఫరా పథకాల నిర్వహణ దెబ్బతిన్నాయని చెప్పారు.
వీధి దీపాలు వెలిగించడం లేదని, నిర్వహణ లేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయని, గ్రామీణ ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. పంచాయితీ నిధుల సమప్యతో 3.54కోట్ల గ్రామీణ ప్రజల జీవితాలు దారుణంగా ప్రభావితం అయ్యాయని చెప్పారు.
గ్రామ పంచాయితీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోడానికి ఎన్నికలు జరగక పోవడమేకారణమన్నారు. 1-8-2018లో నిర్వహించాల్సిన ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించారని, కేంద్రానికి గ్రాంట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఆలస్యంగా సమర్పించడం, గ్రామ పంచాయితీల ఖాతాలను పిఎంఎఫ్‌ఎస్‌లతో అనుసంధానించక పోవడం వల్ల పంచాయితీలకు నష్టంజరిగిందని, సకాలంలో గ్రాంట్లు అందలేదన్నారు.
పవన్ సమాధానంపై సభ్యుల అభ్యంతరం…
పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాచారంలో వ్యత్యాసాలు ఉన్నాయని కూన రవికుమార్ ఆరోపించారు. 14,15 ఆర్థిక సంఘాలు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తాయని, 2019 నుంచి ప్రతి ఏడాది గ్రాంట్లు ఎందుకు తగ్గుముఖం పట్టాయన్నారు. నిధులు తగ్గడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం పూర్తైనా గ్రామ పంచాయితీలకు నిధులు ఎందుకు విడుదల కాలేదన్నారు.
అసెంబ్లీలో పవన్ ప్రకటించినట్టు గ్రామ పంచాయితీలకు విడుదల కాలేదని, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడకు వెళ్లాయని నిలదీశారు. ఆ డబ్బులు, ఏ పంచాయితీకి రాలేదు. ఎక్కడైనా చూపించారా, రుజువు చేయాలన్నారు. 2019-20 నుంచి పంచాయితీ నిధులను ప్రభుత్వమే వాడేసుకుందన్నారు.
పంచాయితీలను ప్రక్షాళన చేయాలని చింతమనేని డిమాండ్ చేశారు. 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలని, పంచాయితీలలో పాలన గాడిన పెట్టాలన్నారు.
మాజీ సిఎం వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, నిధులు మొత్తం దారి మళ్ళించారని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆరోపించారు. నిధులు గురించి ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టారని సర్పంచులపై కేసులు పెట్టారని ఆరోపించారు. పంచాయితీ నిధులు మళ్లించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చింది చంద్రబాబేనని, వారికి రూ.10వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఇచ్చారని, దానిని నెరవేర్చాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విజ్ఞప్తి చేశారు.
2019-24 మధ్య వైసీపీ నిర్లక్ష్యం వల్ల పంచాయితీ రాజ్ చీకటి కోణం చూడాల్సి ఉందన్నారు. 2014-19మధ్య 22డిపార్ట్‌మెంట్లతో కన్వర్జెన్స్ చేసి మురిగిపోతున్న నిధుల్ని తెప్పించి పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంట్‌కు వైభవం తెచ్చామని మాజీ ఐఏఎస్ రామాంజనేయులు చెప్పారు.
పంచాయితీల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లను తీసేసి కొత్త వ్యవస్థను తెచ్చారని ఆరోపించారు. పంచాయితీల్లో పనిచేసే ఉద్యోగులు జీతాలు లేక 2500మంది ఇబ్బందులు పడ్డారన్నారు. సమాంతర వ్యవస్థలతో పంచాయితీలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
నిధులు మళ్లింపు నిజమే…
పంచాయితీలలో నిధుల మళ్లింపు వ్యవహారంపై సభ్యులు లేవనెత్తిన అంశాలను తనకు కూడా తెలుసని పవన్ కళ్యాణ్ చెప్పారు. వారసత్వంగా సమస్యలు వచ్చాయన్నారు. ప్రస్తుతం పంచాయితీల్లో బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బులు లేవన్నారు. ఖాతాల్లో డబ్బులు కనిపిస్తున్నాయని, ట్రాన్సాక్షన్ జరిగినా నిధులు మాత్రం రాలేదన్నారు.
ఈ వ్యవహారంపై సభలో నాలుగైదు గంటల సెషన్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి 24వరకు 15వ ఆర్థిక సంఘంలో 5251 కోట్ల గ్రామపంచాయితీ ఖాతాలకు వచ్చాయని, 14వ ఆర్థిక సంఘం ద్వారా 2336కోట్లు, మొత్తం 7526 కోట్లు వస్తే వచ్చిన నిధులలో 2285 కోట్లను ఏపీ డిస్కమ్‌లకు ఆర్థిక శాఖ తరలించిందని చెప్పారు. ఎవరి అనుమతి లేకుండా ఇచ్చేశారని దీనిపై అడుగుతుంటే చీమల దండులా సందేహాలు వస్తున్నాయన్నారు.
పంచాయితీరాజ్ అవకతవకల మీద ప్రత్యేక సెషన్ జరగాల్సి ఉందన్నారు. ఇంకా పంచాయితీలకు 691 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కేంద్రం కేటాయించే నిధులు ఏటా మారుతుంటాయని, దీనిపై వివరణ ఇస్తామని చెప్పారు. సీనరేజీ చార్జీలు,స్టాంప్ డ్యూటీ చార్జీల నుంచి పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్‌కు రావాల్సిన నిధులపై చర్యలు తీసుకుంటామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నట్టే పంచాయితీలకు కూడా రాజ్యాంగ రక్షణ ఉందని గత ప్రభుత్వ హయంలో వాటిని లెక్క చేయలేదని తమ ప్రభుత్వంలో వాటిని అమలు చేస్తామన్నారు.
ప్రతి పంచాయితీకి బ్యాంక్ ఖాతా తెరవాలని చెప్పిందని దానిని కూడా అమలుచేస్తామని చెప్పారు. గ్రామ పంచాయితీ నిధులు పంచాయితీలకే దక్కేలా కృషి చేస్తానన్నారు. సభ్యుల సందేహాలకు ఖచ్చితంగా సభలోనే నివృత్తి చేస్తానన్నారు.