Pithapuram : పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం అమానుషం : పవన్ కళ్యాణ్
08 October 2024, 15:21 IST
- Pithapuram : కాకినాడ జిల్లా పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఇష్యూపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో.. తాజాగా డిప్యూటూ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం అమానుషం అని వ్యాఖ్యానించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పిఠాపురంలో బాలికపై అఘాయిత్యం అమానుషం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ అమానుష చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు పవన్ వెల్లడించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం.. నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఇష్యూపై వైసీపీ పవన్‌ను టార్గెట్ చేసింది.
'సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ పవన్ కళ్యాణ్? కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న బాలికను మరో మహిళ సాయంతో మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకువెళ్లాడు. మాధవపురం శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అపస్మారక స్ధితిలోకి వెళ్లిన బాలికను ఆటోలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల మాన, ప్రాణాలకి రక్షణ కరువైంది' అని వైసీపీ విమర్శలు గుప్పించింది.
అసలు ఏం జరిగింది..
కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై సోమవారం అత్యాచారం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్.
ఆటో డ్రైవర్ జాన్.. మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మహిళను కాపలాగా పెట్టి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం.
అత్యాచారం తర్వాత బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా.. డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే వారు జాన్‌ను, మహిళను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అయితే.. నిందితుడిని కేసు నుంచి తప్పించాలని కొందరు నాయకులు పోలీసులపై ఒత్తడి చేస్తున్నట్టు సమాచారం.
జాన్‌ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.