తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp On Lokesh Case : యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు లోకేశ్ పై తప్పుడు కేసు- టీడీపీ

TDP On Lokesh Case : యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు లోకేశ్ పై తప్పుడు కేసు- టీడీపీ

26 September 2023, 15:35 IST

google News
    • TDP On Lokesh Case : అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు వేయకపోయినా, ఇందులో స్కామ్ అంటూ వైసీపీ ప్రభుత్వం లోకేశ్ పై కేసు నమోదు చేసిందని టీడీపీ ఆరోపించింది. ఇది జగన్ మార్క్ ఫ్యాక్షన్ కక్ష సాధింపు అని ఆరోపించింది.
నారా లోకేశ్
నారా లోకేశ్

నారా లోకేశ్

TDP On Ysrcp Govt :సీఎం వైఎస్ జ‌గ‌న్ ఫ్యాక్షన్ మ‌న‌స్తత్వంతో టీడీపీపై క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు పాల్పడుతున్నార‌ని, ధ‌ర్మమే టీడీపీ ర‌క్షణ‌గా నిలుస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం టీడీపీ ఎంపీలు, అందుబాటులో ఉన్న నేత‌ల‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ స‌మావేశం అయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, వైసీపీ స‌ర్కారు పెడుతున్న త‌ప్పుడు కేసులు, టీడీపీ న్యాయ‌పోరాటం అంశాల‌పై చ‌ర్చించారు. ఎటువంటి సంబంధంలేకున్నా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారా లోకేశ్ పేరుని చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖ‌లు చేయ‌డంపైనా టీడీపీ నేత‌లు చ‌ర్చించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన శాఖ కాక‌పోయినా, అస‌లు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది వేయ‌క‌పోయినా, ఇందులో స్కామ్ అంటూ కేసు న‌మోదు చేసి..అందులో A14గా నారా లోకేశ్ పేరు చేర్చారంటేనే...ఇది ముమ్మాటికీ జ‌గ‌న్ మార్క్ ఫ్యాక్షన్ క‌క్ష సాధింపుయేన‌ని నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

యువగళం పాదయాత్రను అడ్డుకోవాలనే

స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేక‌పోయినా చంద్రబాబు అరెస్టు చేసిన‌ట్టే, లోకేశ్ కు సంబంధ‌మే లేని కేసులో ఇరికించాలని చూస్తున్నార‌ని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌గ‌న్ ఎన్ని కేసులు పెట్టి వేధించినా, ధ‌ర్మం టీడీపీ ప‌క్షాన ఉంద‌ని, న్యాయ‌పోరాటం ద్వారా ఎదుర్కొందామని తీర్మానించారు. యువ‌గ‌ళం మ‌ళ్లీ ప్రారంభిస్తాన‌ని లోకేశ్ ప్రక‌టించిన నేప‌థ్యంలో .. ఎలాగైనా పాద‌యాత్రని అడ్డుకోవాల‌ని ఈ త‌ప్పుడు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. అరాచ‌క వైసీపీ పాల‌న‌పై తెలుగుదేశం పార్టీ త‌ల‌పెట్టిన జ‌న‌చైత‌న్య కార్యక్రమాలు ఏ ఒక్కటీ ఆగ‌వ‌ని, ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా యువ‌గ‌ళం ఆగ‌ద‌ని, న్యాయ‌పోరాటంలో విజ‌యం సాధిస్తామ‌ని టీడీపీ ఎంపీలు, నేత‌లు ధీమా వ్యక్తం చేశారు.

కేసులపై జాతీయ స్థాయిలో పోరాటం

ఏపీలో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయం జాతీయ స్థాయిలో ఎండగట్టాలని, మన వైపు న్యాయం ఉందని టీడీపీ నేతలు అన్నారు. ఏ తప్పూ చేయలేదు అనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. వీటిని జాతీయ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా పోరాడాలని లోకేశ్ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు, నిజాలు వివరిస్తూ టీడీపీ తయారు చేసిన పుస్తకాలు పంపిణీ చేసి జాతీయ మీడియా, జాతీయ నాయకులకు ఏపీలో జరుగుతున్న అరాచక పాలన గురించి వివరించాలని లోకేశ్ ఎంపీలతో అన్నారు.

తదుపరి వ్యాసం