Supreme Court On Skill Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు, సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్!
17 October 2023, 16:44 IST
- Supreme Court On Skill Case : స్కిల్ కేసు కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తైయ్యాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్
Supreme Court On Skill Case : స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం తుది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం...ఇరుపక్షాల వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పి్స్తామని చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. అయితే సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అనంతరం ఈ కేసులో తుది తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
రాజకీయ కక్షసాధింపులకు అవకాశం
అంతకు ముందు హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ... స్కిల్ డెవలప్మెంట్ కేసుకు 17ఏ వర్తిస్తుందని వాదించారు. రిమాండ్ సమయంలో ఈ కేసులో చంద్రబాబును పేరును చేర్చానని తెలిపారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని వాదించారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలే ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతను విచారించడం తమ హక్కు అన్నట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని సాల్వే వాదించారు. రాజకీయ కక్షసాధింపులను నిరోధించేందుకు 17ఏ సెక్షన్ ఉందన్నారు. ఈ సెక్షన్ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందన్నారు. 1964 నాటి రతన్ లాల్ కేసును హరీశ్ సాల్వే ప్రస్తావించారు. 17ఏ వర్తిస్తుందా? లేదా? అన్న దానిపై విచారణ జరుగుతోందని మధ్యంతర బెయిల్ ఈ పిటిషన్ లో ప్రస్తావన లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం అభిప్రాయపడింది.
17ఏ హైబ్రిడ్ సెక్షన్
అయితే క్వాష్ పిటిషన్ విచారణకు 17ఏ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినింపిచారు. కోర్టులో జరుగుతున్న వాదనలు కేవల ప్రొసీజర్ ప్రకారమే కాకూడద్నారు. ఈ కేసులో వాస్తవ విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్ అన్న రోహత్గీ అవినీతిపరులకు ఈ సెక్షన్ రక్షణ కాకూడదన్నదే తన వాదన అన్నారు.
చంద్రబాబును అరెస్టు చేయొద్దు
ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిగింది. కోర్టు విచారణ జరిగే వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ జరిగే వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టును కోరారు. అప్పటివరకు అరెస్టు చేయొద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సీఐడీకి సూచించింది.