Kurnool Crime: కర్నూలులో ఘోరం, ప్రేమ జంటపై వేట కొడవళ్లతో దాడి...తప్పించుకుని పారిపోయిన యువతి…
18 December 2024, 14:14 IST
- Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంటపై వేట కొడవళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో యువతి తప్పించుకోగా, దుండగులకు దొరికిన యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కర్నూలులో ప్రేమ జంటపై వేటకొడవళ్లతో దాడి
Kurnool Crime: కర్నూలు జిల్లాలో ప్రేమజంటపై దాడి ఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలోని మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఎమ్మిగనూరుకు చెందిన వడ్డే అరవింద్ స్థానికంగా ఓ కళాశాలలో దూర విద్యా డిగ్రీ చదువుతున్నాడు.
అరవింద్ గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అరవింద్‌ను ప్రేమిస్తోంది. మంగళవారం ప్రేమికురాలి నుంచి ఫోన్ రావడంతో అతడు ఎమ్మిగనూరు నుంచి మోటార్ సైకిల్ పై గాజులదిన్నె ప్రాజెక్టు రోడ్డు వద్దకు చేరుకున్నాడు.
సమీపంలోని ఎల్ ఎల్ సి కాలువ వద్ద యువతితో కలిసి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో అప్పటికే అక్కడ ముళ్లపొదల మాటున కాపు కాచిన ముగ్గురు యువకులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్రేమ జంటతో గొడవపడ్డారు. అనంతరం తమతో తెచ్చుకున్న వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడి చేయడంతో యువతి పారిపోగా, అరవింద్ వారికి దొరికి పోయాడు. దీంతో వేటకొడవళ్లతో అరవింద్‌పై దాడి చేశారు. కాపాడాలని అరవింద్ గట్టిగా కేకలు వేయడంతో కేకలు విన్న పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు పరుగున వచ్చి నిందితులపై రాళ్లు విసిరారు. దీంతో వారు అరవింద్‌ను అక్కడే వదిలేలేసి మోటారు సైకిళ్లపై పరారయ్యారు.
బాధితుడు అరవింద్ రక్తపుమడుగుల్లో తీవ్ర గాయాలతో పడి ఉండటంతో రైతులు పోలీసులకు సమాచారం అందించారు. గోనెగండ్ల సీఐ గంగాధర్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అరవింద్‌ను అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు. యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారా? లేక గిట్టనివారు పగతో దాడి చేశారా? అనేది విచారణ చేస్తున్నామని సీఐ గంగాధర్ తెలిపారు.
లైంగిక దాడి చేసి వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష
బాలికపై లైంగికదాడి చేసి, ఆమెను గర్భవతి చేసిన నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి వి.భవాని తీర్పు ఇచ్చారు. విజయవాడలోని కొత్తపేటకు చెందిన బాలిక (17)కు అదే ప్రాంతానికి చెందిన పిల్లా మోహన్ ప్రేమ పేరుతో దగ్గరై, ఆమెను ఖమ్మం తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2026 నవంబర్ 8న వెలుగు చూసింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
2017 జనవరి 21న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కృష్ణవేణి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. 15 మంది సాక్షులను విచారించారు. దీంతో నేరం రుజువు కావడంతో నిందితుడు మోహన్‌కు జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించారు. నిందితుడు చెల్లించిన జరిమానాలో రూ.10 వేలతోపాటు మరో రూ.4 లక్షలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)