తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Consultancy Raj: ఆంధ్రాలో కన్సల్టెన్సీ రాజ్.. కన్సల్టెంట్ల మోజులో ఏపీ బ్యూరోక్రసీ, అంతుచిక్కని కారణాలు…

AP Consultancy Raj: ఆంధ్రాలో కన్సల్టెన్సీ రాజ్.. కన్సల్టెంట్ల మోజులో ఏపీ బ్యూరోక్రసీ, అంతుచిక్కని కారణాలు…

23 December 2024, 5:36 IST

google News
    • AP Consulatncy Raj: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో పాలనలో వచ్చిన మార్పుల సంగతి పక్కన పెడితే కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులు మాత్రం కన్సల్టెంట్ల మోజులో ముఖ్యమంత్రినే మభ్య పెట్టే స్థాయికి చేరుకున్నారు.సీఎంకు తెలియకుండానే  కన్సల్టెంట్లను నియిమిస్తున్నారు. 
సీఎంకు తెలియకుండానే శాఖల్లో కన్సల్టెంట్లు చొరబడుతున్నారా?
సీఎంకు తెలియకుండానే శాఖల్లో కన్సల్టెంట్లు చొరబడుతున్నారా?

సీఎంకు తెలియకుండానే శాఖల్లో కన్సల్టెంట్లు చొరబడుతున్నారా?

AP Consulatncy Raj: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం కన్సల్టెంట్ల గుప్పెట్లో చిక్కుకుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, నైపుణ్యం పేరుతో లక్షలకు లక్షలు జీతాలు చెల్లించి స్టేట్ సర్వీస్‌ అధికారులపై పెత్తనం చేయడానికి కన్సల్టెంట్లను పాలనా వ్యవస్థలో చొప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప‌్రభుత్వంలో కొన్నేళ్లుగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యవస్థల్లో మధ్యవర్తుల చొరబాటు అంతకంతకు ఎక్కువైపోతోంది. ప్రభుత్వ విభాగాల్లో రకరకాల కారణాలతో కన్సల్టెంట్ల నియామకం కొన్నేళ్లుగా సాగుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత ఆలిండియా సర్వీస్‌ అధికారుల కంటే ఎక్కువ జీతాలు చెల్లించి మరీ కన్సల్టెంట్లను నియమించుకునే సాంప్రదాయం మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులపై పాలకులకు నమ్మకం లేకపోవడం, తాము చెప్పినట్టు చేయడం వంటి కారణాలతో కన్సల్టెంట్లకు పాలకులు మొగ్గు చూపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, బ్యూరోక్రసీలో కన్సల్టెంట్ల హవా మాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి ని ప్రసన్నం చేసుకునేందుకు అఖిల భారత స్థాయి అధికారులు అంతర్జాతీయ కన్సల్టెంట్లపై ఆధారపడటంతో ప్రభుత్వ డేటాను అందమైన ప్రెజెంటేషన్లుగా మార్చేసి అంకెల గరడీతో మభ్య పెట్టడం కొందరు అధికారులకు అలవాటుగా మారిపోయింది.

పాలనలో సంస్కరణలు, ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శకత, ప్రజా ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేయాల్సిన అధికార యంత్రాంగంలో కొత్త వ్యవస్థలు చొరబడటం, దానినే పాలనా సంస్కరణలుగా భ్రమింప చేయడటం కొన్నేళ్లుగా రివాజుగా మారింది. పార్టీలు ప్రభుత్వాలు మారినపుడల్లా అవే కన్సెల్టెన్సీ సరికొత్త ప్రతిపాదనలు ప్రణాళికలతో రంగురంగుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో పాలనా యంత్రాంగంలోకి చేరిపోతున్నాయి.

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి కన్సల్టెన్సీల నియామకంపై ముఖ్యమంత్రి స్థాయిలో అమోదం లభించిన తర్వాత బయటి వ్యక్తులను ప్రభుత్వ వ్యవస్థలోకి కన్సల్టెంట్లుగా తీసుకునేలా జీవో నంబర్‌ 86ను ఆర్థిక శాఖ జారీ చేసింది.

కన్సల్టెన్సీల అవసరం ఎందుకు...

ప్రభుత్వ పాలనా వ్యవస్థలో కీలకమైన శాఖలకు అధిపతులుగా ఆలిండియా సర్వీస్‌ అధికారులు ఉంటే, వారి కింద వివిధ హోదాల్లో రాష్ట్ర సర్వీస్‌ అధికారులు పనిచేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో సర్వీస్‌తో పాటు పదోన్నతులతో జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్‌ స్థాయి వరకు చేరుకుంటారు. సచివాలయాల్లో అయితే వివిధ హోదాల్లో సెక్రటరీలు ఉంటారు.

ఈ క్రమంలో కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులపై నమ్మకం లేకపోవడం, స్టేట్ సర్వీస్ అధికారుల్లో చాలామంది రిటైర్మెంట్‌ వయసుకు దగ్గర్లో ఉండటంతో శాఖాధిపతుల అంచనాలకు అనుగుణంగా నివేదికలు, రిపోర్టులు తయారు చేసే పరిస్థితులు లేవు. కొన్ని శాఖల్లో అధికారులకు పవర్ పాయింట్ తయారు చేయడం, ఎక్సెల్‌ షీట్లలో డాటాను విశ్లేషించడం వంటి నైపుణ్యాలు కూడా ఉండవు. సరిగ్గా ఈ పరిస్థితుల్ని అనువుగా మార్చుకుని కొన్నేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెంట్లు చొరబడటం మొదలైంది.

ప్రభుత్వ శాఖల్లో విధాన పరమైన నిర్ణయాలను తీసుకోవడం నుంచి వాటి అమలు వరకు క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలు తయారు చేసి, వాటిని అందమైన పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్లుగా మలచి కొత్త పథకాలకు రూపుదిద్దడంలో కన్సల్టెన్సీల పాత్ర మొదలవుతోంది. రాష్ట్ర సర్వీస్‌ అధికారులతో పనులు చేయించడం కంటే బయటి వారితో పనిచేయించడం, తాము కోరుకున్న విధంగా నివేదికలు రూపొందించడం శాఖాధిపతులకు సులువుగా మారింది.

అవసరానికి మించి ఆధారపడుతూ…

కన్సల్టెంట్లు సబ్జెక్ట్‌ నిపుణుడు అయితే ఫర్లేదు కానీ కొన్నేళ్లుగా కన్సల్టెన్సీల నియామకమే ఫార్సుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. స్టేట్ సర్వీస్‌ అధికారులకు క్షేత్ర స్థాయి అవసరాలు, వనరులు, ప్రాక్టికల్‌గా ఉండే ఇబ్బందులపై అవగాహన ఉన్నా వారి సేవల్ని వినియోగించుకోవడం లేదు.  స్టేట్ సర్వీస్‌ అధికారుల నివేదికలను అంగీకరించడానికి ఆలిండియా సర్వీస్ అధికారుల అహం అడ్డుగా మారుతోంది. సరిగ్గా ఇదే బలహీనతను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విభాగాల్లో కన్సల్టెన్సీ చొరబాటు అధికం అయ్యింది.

ఇక కన్సల్టెన్సీల నియామకంలో కమిషన్ల పర్వం ఉంటుందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో సంబంధిత శాఖల మంత్రుల ప్రమేయం కూడా ఉండదు. శాఖాధిపతులు, కమిషనర్ల నిర్ణయం మీదే వీటి నియామకాలు జరిగిపోతాయి. కన్సల్టెంట్లపై పర్యవేక్షణ బాధ్యతలు ఎవరివనే విషయంలో జవాబుదారీతనం తీసుకోడానికి అధికారులు సుముఖంగా ఉండరు. ఆ క్షణానికి ప్రభుత్వ అధినేతను మెప్పించడం, మార్కులు కొట్టేయడంపైనే శాఖాధిపతులైన అధికారుల దృష్టి ఉంటుంది.

ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖల వారీగా కన్సల్టెంట్ల నియామకం మరోకథనంలో…

(ఇంకా ఉంది)

తదుపరి వ్యాసం