తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Srivani Trust: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం

TTD Srivani trust: శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం

Sarath chandra.B HT Telugu

15 December 2023, 9:23 IST

google News
    • TTD Srivani trust: టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి) ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం, ప‌లు ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి

TTD Srivani trust: టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి) ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం, ప‌లు ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గురువారం ఆల‌యాల నిర్మాణంపై ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

శ‌్రీ వాణి ట్ర‌స్టు ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 1500 ఆల‌యాల నిర్మాణం పూర్త‌యింద‌ని, మిగిలిన ఆల‌యాల నిర్మాణాన్ని వ‌చ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాల‌ని అధికారులను కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ 1973 ఆల‌యాల‌ను నిర్మించినట్టు వివరించారు.

స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్ 320 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టిన 307 ఆల‌యాల‌ను పూర్తి చేసింద‌ని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో ప్ర‌జ‌లు క‌మిటీలుగా ఏర్ప‌డి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆల‌యాల నిర్మాణానికి ఆర్థిక‌సాయం అందిస్తున్నామ‌ని తెలిపారు.

వీటితోపాటు ప‌లు న‌గ‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాలు నిర్మించామ‌ని తెలియ‌జేశారు. స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్‌కు మ‌రికొన్ని ఆల‌యాల నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు యోచిస్తున్నామ‌న్నారు.

స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ‌విష్ణు మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో ఎస్‌సి, ఎస్‌టి కాల‌నీలు, కొండ ప్రాంతాలు, స‌ముద్ర‌తీర ప్రాంతాల్లో నిర్మించిన ఆల‌యాల్లో మూడు చార్టెడ్ అకౌంటెంట్ సంస్థ‌ల ద్వారా సామాజిక త‌నిఖీ(సోష‌ల్ ఆడిట్) చేశారని చెప్పారు.

ఆల‌యాల నిర్వ‌హ‌ణ చ‌క్క‌గా జ‌రుగుతోంద‌ని, భ‌క్తులు ఎంతో సంతోషంగా ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటున్నార‌ని, గ్రామాల్లో విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌లు క‌ల‌సిమెల‌సి ఉంటున్నార‌ని సామాజిక త‌నిఖీల్లో వెల్ల‌డైంద‌ని, ఇది ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు.

నూత‌న ఆల‌యాలు, జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టిన ఆల‌యాల్లో ఆయా ప్రాంతాల్లో అదే వ‌ర్గానికి చెందినవారిని అర్చ‌కులుగా నియ‌మించారని వెల్ల‌డించారు. ఈ ఆల‌యాల్లో ధూప‌దీప నైవేద్యాల కోసం శ్రీ‌వాణి ట్ర‌స్టు నుండి ప్ర‌తి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్టు చెప్పారు.

తదుపరి వ్యాసం