తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila Security: షర్మిల భద్రతపై కాంగ్రెస్ ఆందోళన

Ys Sharmila Security: షర్మిల భద్రతపై కాంగ్రెస్ ఆందోళన

Sarath chandra.B HT Telugu

01 February 2024, 13:25 IST

google News
    • Ys Sharmila Security: పిసిసి అధ్యక్షురాలు షర్మిల భద్రతపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆమె భద్రతకు ముప్పు పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 
భద్రత కోరుతూ డీజీపీ లేఖ రాసిన షర్మిల
భద్రత కోరుతూ డీజీపీ లేఖ రాసిన షర్మిల

భద్రత కోరుతూ డీజీపీ లేఖ రాసిన షర్మిల

Ys Sharmila Security: పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు వారాల్లోనే అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోదరుడు జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వర్గానికి, వైసీపీకి నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడుస్తోంది.

ఇక సోషల్ మీడియాలో షర్మిలపై ముప్పెట దాడి జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను వదిలేసి వైసీపీ పూర్తి స్థాయిలో షర్మిలను టార్గెట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన షర్మిల రోజుకో రకంగా వైసీపీ అధ్యక్షుడికి ప్రశ్నలు సంధిస్తున్నారు.

షర్మిల తీరును వైసీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఆమెను ఎదుర్కొనే క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ పరిణామాలకు ఆమె కూడా సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మరోవైపు రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ షర్మిల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం షర్మిలకు వన్‌ ప్లస్‌ వన్ గన్‌మెన్లను కేటాయించారు. జిల్లా పర్యటనల్లో ఆమె ఎలాంటి భద్రత లేకుండానే పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తనకు అదనపు భద్రత కల్పించాలని షర్మిల గత నెల 22వ తేదీన డీజీపీ లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఆమె కుటుంబానికి గతంలో ఉన్న భద్రతను కుదించారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.

రాజకీయంగా షర్మిలను ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా షర్మిలకు అదనపు భద్రత కల్పించాలని ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు. నాయకుల రక్షణ సమాజం సమిష్టి బాధ్యత అని ఆ బాధ్యత నెరవేర్చడం స్వతంత్ర పోలీస్ వ్యవస్థతోనే సాధ్యమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి డీజీపీని స్వతంత్రంగా పనిచేయనివ్వాలని , అందుకు నిర్ణయాలు తీసుకోనివ్వాలని, వైఎస్సార్‌ కుమార్తెకు ఉన్న సెక్యూరిటీని తగ్గించకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం ప్రాణాలతో ఆడుకోవడం ఎవరికి మంచిది కాదని సూచించారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం సెక్యూరిటీ కేటాయింపు అంశం పోలీసుల నిర్ణయం ఆధారంగా ఉంటుందని వాదిస్తున్నారు.

తదుపరి వ్యాసం