తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ntr Collector And Ganta: దుర్గగుడిలో ఎన్టీఆర్ కలెక్టర్.. సింహాచలంలో మాజీ మంత్రి గంటా.. ప్రసాదాలను ఎంగిలి చేశారంటూ రచ్చ

NTR Collector And Ganta: దుర్గగుడిలో ఎన్టీఆర్ కలెక్టర్.. సింహాచలంలో మాజీ మంత్రి గంటా.. ప్రసాదాలను ఎంగిలి చేశారంటూ రచ్చ

08 October 2024, 11:59 IST

google News
    • NTR Collector And Ganta: దుర్గగుడిలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, సింహాచంలో మాజీ మంత్రి గంటా ప్రసాదాలను ఎంగిలి చేశారంటూ వివాదం రాజుకుంది.ఏపీలో కాదేదీ వివాదాలకు అనర్హం అన్నట్టు తయారైంది ఇటీవలి పరిస్థితి.  లడ్డూ పోటులో ప్రసాదాల తయారీని పరిశీలిస్తూ కలెక్టర్‌ ప్రసాదాన్ని రుచి చూసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 
దుర్గగుడిలో లడ్డూల రుచి పరిశీలిస్తున్న కలెక్టర్ సృజన
దుర్గగుడిలో లడ్డూల రుచి పరిశీలిస్తున్న కలెక్టర్ సృజన

దుర్గగుడిలో లడ్డూల రుచి పరిశీలిస్తున్న కలెక్టర్ సృజన

NTR Collector And Ganta: దుర్గగుడిలో లడ్డూ ప్రసాదాలను జిల్లా కలెక్టర్ ఎంగిలి చేశారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రంలో లడ్డూలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రుచి చూస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

నిన్న మొన్నటి వరకు ఏపీలో తిరుపతి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారని పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టును చేరడంతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో వైసీపీ-టీడీపీల మధ్య కల్తీ నెయ్యి వ్యవహారంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఇంద్రకీలాద్రిపై ఉన్న లడ్డూ పోటు కేంద్రంలో ప్రసాదాల తయారీని సోమవారం జిల్లా కలెక్టర్‌ సృజన పరిశీలించారు.

ప్రసాదాల తయారీ నాణ్యతను పరిశీలించే క్రమంలో బూందీ పాకం రుచి చూశారు. ఈ ఫోటోలను సమాచార శాఖ విడుదల చేసింది. దీంతో అమ్మవారి భక్తులు అందుకునే ప్రసాదాన్ని జిల్లా కలెక్టర్ ఎంగిలి చేయడం ఏమిటని ట్రోలింగ్ మొదలైంది. లడ్డూ పోటు కేంద్రంలో సాధారణంగా బయటి వారిని అనుమతించరు. ఆగమ పండితుల సలహా మేరకు దిట్టంతో లడ్డూలను తయారు చేస్తుంటారు.

తిరుమల ప్రసాదాల వివాదం వెలుగు చూసిన తర్వాత దుర్గగుడి సరఫరా చేసే ప్రసాదం పోటు వస్తువుల నాణ్యతను కూడా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ యథాలాపంగా చేసిన చర్య వివాదాస్పదంగా మారింది. లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించేందుకు విడిగా బూందీ పాకాన్ని కలెక్టర్‌కు అందిస్తే ఏ వివాదం ఉండేది కాదు. లడ్డూలు కలుపుతున్న చోటే అందులో నుంచి చేత్తో తీసుకుని తింటున్నట్టున్న ఫోటోలను వైరల్ అయ్యాయి.

సింహాచలంలో మాజీ మంత్రి…

మాజీ మంత్రి గంటా కూడా ఇదే తరహా వివాదంలో చిక్కుకున్నారు. గత శనివారం సింహాచలం వరాహ నరసింహ స్వామి ఆలయంలో లడ్డూల తయారీని భీముని పట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా పరిశీలించారు. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న లడ్డూలను గంటా రుచి చూశారు. దీంతో ఆ వీడియోలను రాజకీయ ప్రత్యర్థులు వైరల్ చేశారు.

ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ప్రసాదాలను ఎంగిలి చేయడం ఏమిటని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌, మాజీ మంత్రి గంటాను టార్గెట్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సనాతన ధర్మం, హిందువుల మనోభావాల గురించి ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

తదుపరి వ్యాసం