Cm YS Jagan | 'భావితరాలకు స్ఫూర్తి.. సమతామూర్తి విగ్రహం'
07 February 2022, 20:24 IST
- Samata Murthy statue | ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు ఏపీ సీఎం జగన్. అక్కడ జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. రామానుజాచార్యులు.. అందరూ సమానమే అన్న విషయాన్ని బోధించారని, భావితరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని జగన్ అన్నారు.
చినజీయర్ స్వామితో సీఎం జగన్
హైదరాబాద్‌కు సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అసమానతలను తొలగించేందుకు రామానుజాచార్యులు కృషి చేశారని.. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం అని తెలిపారు.
"ప్రజలందరు సమానమే.. అన్న సందేశాన్ని ఈ సమతామూర్తి విగ్రహం చాటిచెబుతోంది. భావితరాలకు ఈ విగ్రహం స్ఫూర్తిగా నిలుస్తుంది. అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు పనిచేశారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చినజీయర్ స్వామీకి నా అభినందనలు," అని జగన్ పేర్కొన్నారు.
సంప్రదాయ దుస్తుల్లో ముచ్చింతల్‌కు వెళ్లిన జగన్.. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా.. జగన్‌పై చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు.
"దివంగత వైఎస్ఆర్.. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. ఇప్పుడు జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయాను. విద్య, ధనం, అధికారం కలిగి ఉన్నవారు సహజంగా ఎవరి సలహాలు తీసుకోరు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ.. జగన్‌లో ఎలాంటి గర్వం లేదు. ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు జగన్. అందుకు ఆయనకు నా అభినందనలు. జగన్ మోహన్ రెడ్డి.. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను," అని చినజీయర్ స్వామి తెలిపారు.