Modi Tour Live Updates | సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
05 February 2022, 21:05 IST
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇక్రిశాట్ లో నూతన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముచ్చింతల్ రామానుజాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
జాతీయ స్థాయిలో చర్చ కోసమేనా?
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పణకు స్పందనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లో ప్రధాన మంత్రిపై అనేక ఆరోపణలు గుప్పించారు. బీజేపీపై వార్‌కు శ్రీకారం చుట్టారు. ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు రాలేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేయడం, ఆ తదుపరి టీఆర్ఎస్ శ్రేణులు ట్విటర్ వేదికగా సమానత్వంపై ప్రశ్నించడం ప్రారంభమైంది. దీనికి ఎమ్మెల్యేలు, మంత్రులు తోడయ్యారు. కేసీఆర్ ప్రధాన మంత్రిని వ్యతిరేకించిన బలమైన నేతగా దేశవ్యాప్తంగా చర్చ రావాలన్న యోచన దీని వెనక ఉన్నట్టు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ట్విటర్ వేదికగా తెలంగాణ మంత్రుల ప్రశ్నలు
సమతా స్ఫూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర మంత్రుల నుంచి ప్రశ్నల పర్వం ఎదురైంది. ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు రాలేదన్న బీజేపీ విమర్శలతో ఈ పరిణామం మొదలైంది. ట్విటర్‌లో ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అన్న హాష్ టాగ్‌ను టీఆర్ఎస్ ట్రెండింగ్ చేసింది. తొలుత ఎమ్మెల్యేలు, తదుపరి మంత్రులు ఈ టాగ్‌ను ఉపయోగించి ట్వీట్లు చేస్తూ తెలంగాణ డిమాండ్లను పునరుద్ఘాటించారు. మరోవైపు ప్రధాన మంత్రి ముచ్చింతల్ వెళ్లే దారిలో తెలంగాణ డిమాండ్లతో కూడిన బానర్‌ను ప్రదర్శిస్తూ కొందరు యువకులు కనిపించారు. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అన్న డిమాండ్ ఈ బ్యానర్‌లో కనిపించింది. ట్విటర్‌లో హాష్ టాగ్, బానర్‌లో హాష్ టాగ్ ఒకటే అవడం చూస్తుంటే ఈ బానర్ కూడా టీఆర్ఎస్ వర్గాలే ప్రదర్శించాయని తెలుస్తోంది.
ముచ్చింతల్ నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి
శ్రీ రామానుజాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చింతల్ నుంచి తిరుగు పయనమయ్యారు.
పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి
సౌండ్ అండ్ లైట్ షో తిలకించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. సుమారు 3 గంటల 45 నిమిషాల పాటు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో గడిపారు.
సౌండ్ అండ్ లైట్ షో తిలకించిన ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి తన ప్రసంగం అనంతరం రామానుజాచార్యుడి జీవిత విశేషాలు, బోధనలతో కూడిన సౌండ్ అండ్ లైట్ షోను తిలకించారు.
దళితులు, నిమ్న వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నాం: ప్రధాన మంత్రి
బాబా సాహెబ్ అంబేడ్కర్ వంటి వారు సైతం రామానుజాచార్య సామాజిక బోధనలను ప్రశంసించేవారని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. సమతా స్ఫూర్తి ప్రతిమ స్ఫూర్తిగా సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. దళితులు, బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి. పేదలకు ఇళ్ల నుంచి మొదలు స్వచ్ఛ భారత్ యోజన వంటి పథకాలన్నీ నిమ్న వర్గాలకు అండగా నిలిచాయని అన్నారు. జీవులందరూ సమానమని రామానుజాచార్య చెప్పేవారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
1000 ఏళ్ల క్రితమే సమాజాన్ని తట్టిలేపారు..
‘రామానుజాచార్యులను చూస్తే ప్రగతిశీలత, ప్రాచీనతలో ఎలాంటి వైరుధ్యం లేదని అవగతమవుతుంది. 1000 ఏళ్ల క్రితమే సమాజంలోని మూఢ విశ్వాసాలను, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు భారతదేశపు అసలైన ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లి పరిష్కారం చూపారు. దళితులను, నిమ్నవర్గాల ప్రజలు ఆలింగనం చేసుకున్నారు. జాతి భేదాలు ధర్మం కాబోవని చాటి చెప్పారు..’ అని ప్రధాన మంత్రి వివరించారు.
భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి: ప్రధాన మంత్రి
‘రామానుజచార్య ప్రతిమ ఆయన బోధనలు, ఆదర్శాలకు ప్రతీక. ఈ విగ్రహం కేవలం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా, భారతీయ ప్రాచీన సంస్కృతిని బలోపేతం చేస్తుంది..’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘ఇప్పుడే నేను 108 మందిరాలు సందర్శించాను. రామానుజాచార్య కృప వల్లే సాధ్యమైంది..’ అని అన్నారు. ‘విశ్వక్సేన యాగంలో కూడా నేను భాగస్వామిని అయ్యాను. చినజీయర్ స్వామికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంకల్పం, లక్ష్యం పూర్తి చేసేందుకు ఈ యాగం ఉపయోగపడుతుంది. దేశ ప్రగతి సంకల్పంతో ఈ నేను ఈయాగంలో పాల్గొన్నాను. 130 కోట్ల ప్రజల కలల సాకారం సంకల్పంగా చేసుకుని యాగంలో పాల్గొన్నాను..‘ అని ప్రధాని అన్నారు.
సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. సమతామూర్తి పేరుతో రామానుజచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు మోడీ.
సమతా స్ఫూర్తి కేంద్రంలో మోడీకి స్వాగతం పలికిన బండి సంజయ్
సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రధాని మోడీ 108 దివ్య దేశాలను దర్శించుకుంటున్నారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో మోడీకి బండి సంజయ్, సుధాకర్ రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రామానుజాచార్యుల విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.
సమతాస్ఫూర్తి కేంద్రానికి బయలుదేరిన ప్రధాని మోడీ
ముచ్చింతల్ సమతాస్ఫూర్తి కేంద్రానికి ప్రధాని మోడీ బయలుదేరారు. యాగశాల నుంచి సమతా స్ఫూర్తి కేంద్రానికి వెళ్లి.. 108 దివ్య దేశాలను మోడీ సందర్శించుకుంటారు. అనంతరం రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
మోడీకి స్వర్ణ కంకణం కట్టిన చినజీయర్ స్వామి
ముచ్చింతల్ యాగశాలలో ప్రధాని మోదీ.. విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. యాగశాలలో ప్రధానికి చినజీయర్ స్వామి స్వర్ణ కంకణం కట్టారు. యాగ ప్రాశస్త్యాన్ని ప్రధానికి వివరించారు. విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేశారు ప్రధాని. పూజలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నరు. 108 దివ్య దేశాలను సందర్శించిన అనంతరం.. సమతామూర్తి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు.
యగశాలలో మోడీ
విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్న మోడీ
ముచ్చింతల్ యాగశాలకు ప్రధాని మోడీ చేరుకున్నారు. విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగంలో కూడా పాల్గొననున్నారు. కాసేపట్లో సమతామూర్తి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు.
ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని..
ప్రధాని మోడీ ముచ్చింతల్ చేరుకున్నారు. కాసేపట్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. లక్ష్మీనారాయణ మహాయాగం పూర్ణాహుతిలో పాల్గొననున్నారు.
ముచ్చింతల్ బయలుదేరిన ప్రధాని
ఇక్రిశాట్ నుంచి ప్రధాని మోడీ బయలుదేరారు. హెలికాప్టర్‌లో ముచ్చింతల్ చేరుకోనున్నారు. కాసేపటి తర్వాత రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ చేయనున్నారు.
కాసేపట్లో ముచ్చింతల్ కు ప్రధాని మోడీ
సమతామూర్తి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ప్రధాని మోఢీ ముచ్చింతల్ చేరుకోనున్నారు. అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి విగ్రహం కొలువుదీరిన వేదికపై ఆరుగురు ఆసీనులయ్యేలా ఏర్పాటు చేశారు.
6.40కి సమతా స్ఫూర్తి విగ్రహం వద్దకు చేరుకోనున్న ప్రధానమంత్రి
6.40 నిమిషాలకు సమతా మూర్తి విగ్రహం వద్దకు ప్రధాన మంత్రి చేరుకుంటారు. 7 గంటల వరకు జరిగే పూజాకార్యక్రమంలో పాల్గొంటారు. 7 గంటలకు సమతా స్ఫూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
108 ఆలయాలతో కూడిన దివ్య దేశ సందర్శన
సాయంత్రం 6.05 నుంచి 6.35 వరకు దివ్య దేశం పేరుతో ఉన్న ప్రాంతానికి విచ్చేసి 108 ఆలయాలను సందర్శించనున్నారు.
విశ్వక్సేన యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాన మంత్రి
సాయంత్రం 5.10 గంటలకు యాగశాలల వద్దకు చేరుకుంటారు. 5.15 గంటలకు విశ్వక్సేన యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. విశ్వక్సేన ఇష్టిగా పిలిచే ఈ యాగం.. కోరుకున్న విజయాలను సాధించేందుకు కాంక్షించి తలపెట్టే యాగం. 6.05 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
5 గంటలకు ముచ్చింతల్ చేరుకోనున్న ప్రధాన మంత్రి
ఇక్రిశాట్ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్ చేరుకోనున్నారు. సుమారు రెండున్నర గంటలపాటు సమతామూర్తి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
ఇక్రిశాట్ వార్షికోత్సవ వేడుకల్లో ముగిసిన ప్రసంగం
ప్రధాన మంత్రి 50వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం ముగిసింది. ఇక్రిశాట్ శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలు రైతుల కష్టాలు తీర్చాలని, అంతర్జాతీయ ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు.
బయో ఫ్యూయల్ కోసం కృషి చేయాలి..
దేశంలో ఆహార ధాన్యాల మిగులు ఉంది. ఆహార భద్రతతో పాటు పోషకాహారంపై ప్రధానంగా దృష్టి పెట్టాం. సాగు వైవిధ్యం కోసం, సుస్థిర వ్యవసాయం కోసం ఇక్రిశాట్, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు కలిసి బయో ఫ్యూయల్ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఇది కరువు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు కూడా మేలు చేస్తుందని అన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రయోజనం
నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా అనేక భూములను సాగులోకి తెస్తున్నామని వివరించారు. మరోవైపు సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. వచ్చే ఐదేళ్లలో పామాయిల్ పండే ప్రాంతాల్లో 6.5 లక్షల హెక్టార్ల సాగు విస్తరించేలా రైతులకు మద్దతు ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇది ప్రయోజనకరమని వివరించారు. తెలంగాణలో ప్లాంటేషన్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని వివరించారు.
డిజిటల్ టెక్నాలజీ విస్తరణ
డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు చల్లడం, భూముల రికార్డుల డిజిటైజేషన్ వంటి అధునాతన సాంకేతికత వ్యవసాయ రంగంలోకి అందుబాటులోకి వచ్చిందని ప్రధాన మంత్రి వివరించారు. ప్రయివేటు అగ్రిటెక్ వ్యాపారులతో కలిసి వ్యవసాయ రంగంలో మరింత విస్తృతంగా డిజిటల్ టెక్నాలజీని విస్తరించవచ్చన్నారు.
సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం
ఒకవైపు సాధారణ ధాన్యగింజలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తేనే తృణధాన్యాలను, సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నామని, ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని వివరించారు.
80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే
వాతావరణ మార్పులు చిన్న రైతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, దేశంలో 80 నుంచి 85 శాతం చిన్న రైతులేనని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
ఇక్రిశాట్‌కు ప్రశంసలు
వ్యవసాయాన్ని సుస్ధిర, సమగ్ర వికాసానికి ఇక్రిశాట్ పని చేస్తోందని ప్రధాన మంత్రి ప్రశంసించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో సమగ్ర విధానాలను అవలంబించాలని ఆకాంక్షించారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయాలన్నారు.
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ సదస్సులో ప్రధాన మంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రశంసించారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. దేశం మరో 25 ఏళ్ల కోసం లక్ష్యం ఏర్పరుచుకుని ఆ దిశగా పని చేస్తోందని, ఇక్రిశాట్ కూడా 25 ఏళ్లకు లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
50 వార్షికోత్సవ స్మారక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. క్లైమేట్ ఛేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ ప్లాంట్ ప్రొటెక్షన్‌ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవాల్లో మాట్లాడుతున్న తోమర్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ సదస్సులో మాట్లాడారు. తాజా బడ్జెట్ అన్ని వర్గాల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. తృణ ధాన్యాలు కేవలం పేదలకే కాకుండా, దేశంలోని అందరి పళ్లెంలో భాగం కావాలని ఆకాంక్షించారు. 2023వ సంవత్సరాన్ని మిల్లట్స్ ఇయర్‌గా పరిగణించాలని ఇప్పటికే ప్రధాన మంత్రి ప్రతిపాదించారని అన్నారు.
శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోడీ 10 నిమిషాలు ప్రసంగం
ఇక్రిశాట్‌లో పంటల క్షేత్ర సందర్శన చేస్తున్నారు ప్రధాని మోడీ. శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని 10 నిమిషాలు ప్రసంగించనున్నారు. అనంతరం ముచ్చింతల్‌కు వెళ్తారు.
ఇక్రిశాట్ లో ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్రిశాట్ చేరుకున్నారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రధాని పరిశీలించారు. కాసేపటి తర్వాత ప్రధాని మోడీ చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ జరగనుంది. ప్రధాన మంత్రి వెంట కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు
108 ఆలయాలు
మహా విగ్రహం చుట్టూ 8 పుణ్య క్షేత్రాలు ఉంటాయి. గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను సైతం నిర్మించారు. ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని కూడా నిర్మింపజేశారు. అష్టదళ పద్మాకృతిలో 45 అడుగుల ఎత్తుతో ఫౌంటెయిన్ నిర్మించారు. దీనికోసం రూ.25 కోట్ల వెచ్చించారు. మరో విశేషం ఏంటంటే.. ఫౌంటెయిన్ పద్మ పత్రాలు విచ్చుకొనేలా రూపొందించారు.
ఎన్నో ప్రత్యేకతలు
రామానుజాచార్యుల విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 42 అడుగుల ఎత్తులో రాగి ఫౌంటెయిన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో శ్రీరామానుజాచార్యుల విగ్రహం కనిపిస్తుంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. రామానుచార్య విగ్రహం చుట్టురా.. నల్లరాతితో చెక్కిన 108 చిన్న ఆలయాలు ఉంటాయి. వాటిని దివ్య దేశంగా పిలుస్తుంటారు.
ద్వారం వద్ద ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలు
ముచ్చింతల్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రామానుజాచార్యుల విగ్రహం దగ్గర ఎటూ చూసిన ప్రత్యేకతలే. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్, గరుడ విగ్రహాలను కూడా పెట్టారు. ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి రోజూ అభిషేకం, పూజలు వంటి అన్ని రకాల సేవలు జరుగుతాయి.
యాగశాల నుంచే ఋత్వికులు, భక్తులు విగ్రహావిష్కరణ వీక్షించాలి
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఇవాళ ముఖ్యమైన ఘట్టం. యాగశాలలో ఈరోజు 11.30 వరకే లక్ష్మీనారాయణ మహాయజ్ఞం జరగనుంది. ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12.30వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకు, రెండు దశలుగా మహాయాగం జరుగుతోంది. సాయంత్రం 4 గంటల్లోపు ఋత్వికులు యాగశాలకు చేరుకొని యాగం మొదలుపెడతారు. సాయంత్రం 4 తర్వాత యాగశాల నుంచి ఋత్వికులు, భక్తులెవరూ బయటికి రావద్దని.., యాగశాల నుంచే భక్తులు, ఋత్వికులు విగ్రహ ఆవిష్కరణను వీక్షించాలని చినజీయర్ స్వామి సూచించారు.
సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు పూర్ణాహుతి కార్యక్రమం
ముచ్చింతల్ లో జై శ్రీమన్నారాయణ శబ్దాలతో మారుమోగుతోంది. యాగశాల, సమతామూర్తి ప్రాంగణానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక శోభ విల్లివిరుస్తోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా.. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మోడీకి ఘనస్వాగతం పలకనున్న కేసీఆర్
హైదరాబాద్ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలకనున్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు అయిపోయాక.. ముచ్చింతల్ రామనుజాచార్య విగ్రహావిష్కరణలో పాల్గొననున్నారు. 5 గంటల నుంచి 8 గంటల వరకు సమతా మూర్తి విగ్రహవిష్కరణ కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం చేస్తారు.
ఐదు గంటలకు రానున్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. 5.10 గంటలకు యాగశాలకు చేరుకుంటారు. 5.30 వరకు యాగశాలలు సందర్శిస్తారు.