CMO Visakha Shifting: డిసెంబర్ కల్లా విశాాఖ వచ్చేస్తానన్న సిఎం జగన్
16 October 2023, 12:31 IST
- CMO Visakha Shifting: ఏపీ సిఎం జగన్ డిసెంబర్ కల్లా తాను విశాఖకు తరలి వచ్చేస్తానని ప్రకటించారు. విశాఖ షిఫ్ట్ అవ్వడానికి కావాల్సిన కార్యాలయాలు చూడాల్సిందిగా అధికారుల్ని పురమాయించినట్టు ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో సిఎం జగన్ ప్రకటించారు.
డిసెంబర్ నాటికి విశాఖ వచ్చేస్తానని ప్రకటించిన సిఎం జగన్
CMO Visakha Shifting: అక్టోబర్ నాటికి విశాఖపట్నంకు సిఎం కార్యాలయాలను తరలించాలని భావించానని డిసెంబర్ నాటికి ఖచ్చితంగా తరలింపు జరుగుతుందని సిఎం జగన్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో సిఎం జగన్ కీలక ప్రకటన చేశారు.
విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు సిఎం సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ నగరానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని.. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు స్థాయిలో అభివృద్ధి చెందడానికి విశాఖక అవకాశాలు ఉన్నాయని,ఆ తరహా మద్దతు విశాఖ నగరానికి అవసరం ఉందన్నారు.
విభజన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదని విశాఖను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అన్ని అనుకూలతలు ఉన్న నగరం ఇదొక్కటే అన్నారు. విభజనతో హైదరాబాద్ వంటి నగరం నగరం ఇప్పటి వరకు ఆంధ్రాకు లేకుండా పోయిందని చెప్పారు. ఈ తరహా ఐటీ పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా ఎదుగుతుందని చెప్పారు.
డిసెంబర్ నుంచి విశాఖలో పాలన
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖకు అన్ని అనుకూలతలు ఉన్నాయని సిఎం పునరుద్ఘాటించారు. విశాఖలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థాలు ఉన్నాయని, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలతో 12-15వేల మంది ఏటా ఇంజనీర్లు విశాఖ నుంచి వస్తున్నారని చెప్పారు. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 4మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీతో ఎడ్యుకేషనల్ హబ్‌గా విశాఖ ఉందన్నారు.
ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖలో ఉన్నందున వేగంగా అభివృద్ధి చెందొచ్చన్నారు. ఐఓసి, ఈస్ట్రర్న్ నావల్ కమాండ్‌లో 20వేల మంది పనిచేస్తున్నారని, పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పూర్తి స్థాయి నగరంగా అన్ని సదుపాయలు ఇప్పటికే ఉన్నాయని, రెండేళ్లలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా అందుబాటులో వస్తుందన్నారు.
తాను విశాఖపట్నం రావడానికి అనువైన కార్యాలయం వెదకాలని ఇప్పటికే సూచించినట్లు జగన్ చెప్పారు. సిఎంఓ అధికారులు కూడా కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నం అయ్యారని, అక్టోబర్ నాటికి తరలింపు కొలిక్కి వస్తుందనుకున్నాని వివరించారు. డిసెంబర్ నాటికి ఖచ్చితంగా విశాఖలోనే ఉంటానని చెప్పారు.
విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటుతో ముందడుగు పడుతుందన్నారు. సిఎం తరలి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని చెప్పారు. అక్టోబర్ నాటికి రావాలనుకున్నానని అది డిసెంబర్‌కు కావొచ్చన్నారు. తాను ఇకపై విశాఖలోనే ఉంటానని సిఎం స్పష్టం చేశారు.
విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటవుతోందని సింగపూర్ నుంచి మెరైన్ డేటా కేబుల్ విశాఖకు ఏర్పాటవుతోందని చెప్పారు. ఐటీ ఆధారిత పరిశ్రమలకు అనువైన వాతావరణం విశాఖలో ఉంటుందని చెప్పారు. విశాఖ ఇన్ఫోసిస్ కేంద్రం అద్భుతాలు చేస్తుందని చెప్పారు.
విశాఖ ఇన్ఫోసిస్ అత్యుత్తమ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. ఇన్ఫోసిస్‌కు ఏ అవసరం వచ్చినా ఫోన్‌కాల్ దూరంలో సిఎంఓ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.