YSR Arogyasri: నేటి నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ
18 December 2023, 7:09 IST
- YSR Arogyasri: ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ చికిత్సల వ్యయ పరిమితిని రూ.25లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీకి సిఎం జగన్ శ్రీకారం చుట్టారు.
సీఎం జగన్
YSR Arogyasri: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ అమోదం తెలిపింది. రోగులకు మరింత మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీయాప్ ను ప్లే స్టోర్‌లోకి అందుబాటులోకి తెచ్చారు.
ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడకు వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి వంటి సందేహాలన్నింటికి వివరంగా ప్రతి ఇంటిలోనూ వివరించే కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో మరిన్ని మెరుగులు దిద్దుతూ.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి మరింత జీవం పోశారు. ఇక నుంచి డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు.
ఇప్పటికే క్యానర్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చయినా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఇంటికి వచ్చి మరింత అవగాహన కల్పిస్తూ.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టారు. కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటింటికీ పంపిణీతో పాటు ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ అయ్యేలా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అశావర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.48 కోట్ల కుటుంబాలకు మరియు 4.52 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. లబ్దిదారులకు పంపిణీ చేసే స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్యవివరాలతో ABHA ID ఉంటుంది.
ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టు సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మాప్స్ ద్వారా ఆనుసంధానించబడిన మార్గాలు, ఆరోగ్య మిత్ర కాంటాక్ట్ నెంబర్లు తెలుసుకునే వెసులుబాటు లభిస్తుంది. తద్వారా రోగి ఆరోగ్యపరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన కలుగుతుంది. మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు సులభతరం అవుతుంది.
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా...
ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకుని తిరిగి పనుల్లోకి వెళ్లేవరకు వారి జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా రోజుకు రూ.225ల చొప్పున నెలకు రూ.5,000 రెండు నెలలైతే రూ.10,000లు అలా ఎన్ని రోజులైనా డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్యఆసరా అందిస్తున్నారు. ఇప్పటి వరకూ 25,27,870 మందికి రూ.1,310 కోట్లు ఆరోగ్య ఆసరాలో చెల్లించారు.
గత ప్రభుత్వంలో ఏటా సగటున రూ.1,034 కోట్లు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి నుంచి... డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా మీద ఏడాదికి రూ.4,100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా నాలుగున్నర సంవత్సరాల కాలంలో వీటి మీద రూ.1,897 కోటు వ్యయం చేశారు.
వైద్య రంగంలో కేవలం సంస్కరణలపై 55 నెలల్లో చేసిన మొత్తం వ్యయం దాదాపు రూ.32,279 కోట్లుగా ఉంది. డాక్టర్ వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది. వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. మీ ఊరిలోనే మీ వద్దనే ఉచిత వైద్యం అందించేలా... దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ప్రతి మండలానికి కనీసం రెండు పీ.హెచ్.సీలు, ప్రితి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనంలో అనుసంధానం.. ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే మరొక డాక్టరు తనకు కేటాయించిన గ్రామాలలోని డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, పాఠసాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తున్నారు.