CM Jagan | రోడ్ల పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి
14 February 2022, 16:16 IST
రోడ్ల పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని జగన్ ఆదేశించారు.
రహదారి భద్రతా మండలి సమావేశంలో సీఎం జగన్
సీఎం జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో రహదారి భద్రతా మండలి(ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశం జరిగింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడ్డంలో 108 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు చెప్పారు. గోల్డెన్ అవర్‌లోగా వారిని ఆస్పత్రులకు చేర్చడంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు.
ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో కలిపి ఒక డ్రైవింగ్ స్కూలు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ ఆదేశించారు. ఈ సదుపాయాలను ఆర్టీసీ వినియోగించుకోవడంతో పాటు, డ్రైవింగ్ శిక్షణ కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. ట్రామా కేర్ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కళాశాలల్లో కూడా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలన్నారు.
'ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా రీహాబిలిటేషన్ సెంటర్‌ను వైజాగ్‌లో ఉంచాలి. తిరుపతి బర్డ్ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్‌ను మెరుగుపరచాలి. రోడ్డుపై లేన్‌మార్కింగ్ చాలా స్పష్టంగా ఉండేలా ఆలోచన చేయాలి. బైక్ లకు ప్రత్యేక లేన్, ఫోర్‌వీల్ వాహనాలకు ప్రత్యేక లేన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేయండి. ఎంత స్పీడులో పోవాలన్నదానిపై సైన్ బోర్డులు కూడా పెట్టాలి. దీనివల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉంది.' అని సీఎం జగన్ అన్నారు.
రోడ్ల పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని జగన్ ఆదేశించారు. జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేయాలన్నారు.
ఈ నిర్ణయాలకు సీఎం గ్రీన్‌సిగ్నల్
రోడ్ సేఫ్ట్ మీద లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌మరియు రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌నుంచి నిపుణులు ఇందులో ఉంటారు. రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకు జగన్ ఆమోదం తెలిపారు. ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్ ట్రీట్ మెంట్ అందేలా నెట్‌వర్క్ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారిపట్ల మంచి సపోర్టు ఇవ్వాలని సీఎం అన్నారు. ఐరాడ్ యాప్ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్ అప్‌డేట్ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్ ఎఫ్‌సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ చేయాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.